ప్రతిపక్షం, ఆగస్టు 17: హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను మంత్రులతో కలిసి పరిశీలించారు. రోగులకు అందించాల్సిన వైద్య సేవలు, ఆసుపత్రి నిర్వహణ, అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కార్డియో, రీనల్, అవయవ మార్పిడి వైద్య విభాగాల్లో ఏర్పాటు చేసిన ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, శస్త్రచికిత్స అనంతర వార్డులు, ట్రామా విభాగం, ఐసీయూలను సీఎం పరిశీలించారు. ఆయా విభాగాల్లో ఉన్న వైద్య పరికరాల పనితీరు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, రోగులకు అందించే చికిత్స విధానాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆసుపత్రిలో రోగుల నమోదు ప్రక్రియ, రిసెప్షన్ వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ డిస్పెన్సర్ యంత్రం పనితీరును కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. ఓపీ కౌంటర్ల వద్ద రోగులకు ఎదురవుతున్న పరిస్థితులను గమనించి, వైద్య సేవలు పొందేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోగుల రద్దీకి అనుగుణంగా సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
అనంతరం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో సీఎం మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య పరీక్షలు, చికిత్స అందేలా చూడాలని చెప్పారు. అత్యాధునిక పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.
టిమ్స్‌లో ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండ సమస్యలు, అవయవ మార్పిడి, అత్యవసర చికిత్సలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందించేలా ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించారు. ఆసుపత్రి పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా అవసరమైన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత, రోగుల సౌకర్యాలు, సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.

































