[t4b-ticker]

రూ.7 ఎక్కువ వసూలు.. దుకాణ యజమానికి ఏకంగా రూ.7 లక్షల జరిమానా!

ప్రతిపక్షం, సెప్టెంబర్ 09: ఆంధ్రప్రదేశ్‌లో వాటర్ బాటిల్‌ను నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర కంటే ఎక్కువకు విక్రయించిన వ్యవహారంలో వినియోగదారుల ఫోరం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవలం రూ.7 అదనంగా వసూలు చేసినందుకు దుకాణ యజమాని భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిఠాపురానికి చెందిన వెంకటేశ్వరరావు చేసిన న్యాయపోరాటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వెంకటేశ్వరరావు కాకినాడ జిల్లాలోని అన్నవరం ఆలయ పరిధిలో ఉన్న ఓ దుకాణంలో వాటర్ బాటిల్ కొనుగోలు చేశారు. ఆ బాటిల్‌పై గరిష్ఠ చిల్లర ధర రూ.18గా ఉండగా.. దుకాణదారు ఆయన వద్ద నుంచి రూ.25 వసూలు చేశారు. అంటే నిర్ణయించిన ధర కంటే రూ.7 అదనంగా తీసుకున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన వెంకటేశ్వరరావు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.

వాటర్ బాటిల్‌పై ముద్రించిన గరిష్ఠ చిల్లర ధర కంటే అధికంగా డబ్బులు వసూలు చేయడం సరికాదని పేర్కొంటూ ఆయన ఫిర్యాదు చేశారు. కేసును పరిశీలించిన వినియోగదారుల ఫోరం.. దుకాణదారు అదనంగా వసూలు చేసిన రూ.7ను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా వినియోగదారుడికి అయిన న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.10 వేల పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.

అదే సమయంలో వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దుకాణ యజమాని రూ.7 లక్షలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించాలని ఫోరం ఆదేశించింది. దీంతో కేవలం రూ.7 అదనంగా తీసుకున్న వ్యవహారం చివరకు దుకాణ యజమానికి భారీ ఆర్థిక భారంగా మారింది.

ఈ ఘటన వినియోగదారులకు కూడా కీలక సందేశాన్ని ఇస్తోంది. దుకాణాల్లో వాటర్ బాటిళ్లు లేదా ఇతర ప్యాక్‌డ్‌ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వాటిపై ముద్రించిన గరిష్ఠ చిల్లర ధరను తప్పనిసరిగా పరిశీలించాలి. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే బిల్లు లేదా కొనుగోలు ఆధారాలను భద్రపరుచుకుని సంబంధిత వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది.

చిన్న మొత్తమే కదా అని అధిక ధరను చెల్లించి వదిలేయకుండా, వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని ఈ కేసు స్పష్టం చేస్తోంది. వ్యాపారులు కూడా వస్తువులపై ఉన్న గరిష్ఠ చిల్లర ధరను మించి వసూలు చేయకుండా నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంది.

Spread the love

Related News

Latest News