ప్రతిపక్షం, ఆగస్టు 03: తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పురోగతి సాధిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో రెండున్నరేళ్లలో 1,000 రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తవడం ప్రభుత్వ వైద్యరంగానికి గర్వకారణమని పేర్కొన్నారు.
సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిమ్స్ వైద్య బృందం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని మంత్రి అభినందించారు. నిమ్స్ ఇప్పటికే 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి మరో మైలురాయిని చేరుకుందని తెలిపారు.
దక్షిణ భారత ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన ఘనత నిమ్స్‌కే దక్కిందని మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు నిర్వహించిన రొబోటిక్ సర్జరీల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా పేద రోగులకు ఉచితంగా అందించడం విశేషమన్నారు.
నిమ్స్‌లో ఇప్పటివరకు యూరాలజీ విభాగంలో 590, గ్యాస్ట్రోఎంటరాలజీలో 248, ఆంకాలజీ విభాగంలో 162 రొబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు మంత్రి వివరించారు. అలాగే ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో కూడా రొబోటిక్ సర్జరీలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
రాష్ట్రంలోని కొత్త టిమ్స్ ఆస్పత్రులు, గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా జనరల్ ఆస్పత్రుల్లో కూడా రొబోటిక్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు నాణ్యమైన చికిత్సను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

















