[t4b-ticker]

ఎమ్మెల్యేలందరికీ కొత్త కార్లు.. సీఎం విజయ్ కీలక ప్రకటన

ప్రతిపక్షం, ఆగస్టు 19: తమిళనాడులోని ఎమ్మెల్యేలందరికీ కొత్త కార్లు అందించనున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రతి ఎమ్మెల్యేకు కారు అందించడంతో పాటు డ్రైవర్ జీతం, వాహన నిర్వహణ తదితర ఖర్చుల కోసం నెలకు రూ.75 వేల చొప్పున ప్రభుత్వం అందించనున్నట్లు సీఎం విజయ్ వెల్లడించారు. అలాగే ఎమ్మెల్యేల కార్యాలయంలో సహాయకుడి కోసం నెలకు రూ.25 వేల చొప్పున నిధులు కేటాయిస్తామని చెప్పారు.

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వాహనాలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభలో వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి ప్రస్తావించారు. ప్రజలతో నేరుగా మమేకమై పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులకు వాహన సదుపాయం అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందించిన సీఎం విజయ్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ కొత్త కార్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, నియోజకవర్గాల్లో నిరంతరం పర్యటించేలా ఎమ్మెల్యేలకు అవసరమైన సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని విజయ్ తెలిపారు.

Spread the love

Related News

Latest News