నియోజకవర్గంలో బలపడుతున్న తిరుపతిరెడ్డి వర్గం!

కార్యకర్తలకు అండగా నిలుస్తూ.. నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు

బీఆర్‌ఎస్‌లో అంతర్గత సమీకరణాలపై రాజకీయ వర్గాల్లో చర్చ

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 03: మెదక్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి కార్యకర్తలకు అండగా నిలుస్తూ, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన వెంట పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో నిలుస్తుండటంతో నియోజకవర్గంలో ఆయన వర్గం బలపడుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
గత 30 ఏళ్లుగా ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఆపదలో ఉన్నవారికి తన వంతు సహాయం అందిస్తున్న తిరుపతిరెడ్డి.. కార్యకర్తలకు కష్టమొస్తే ‘నేనున్నా’ అంటూ భరోసా కల్పిస్తున్నారనే గుర్తింపు పొందారు. సౌమ్య స్వభావం, కలుపుగోలుతనం, దాతృత్వంతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ కార్యకర్తలు, నాయకులను కలుపుకొని ముందుకు సాగడం ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలకంగా మారుతోంది.

పార్టీలో వర్గాల మధ్య సమన్వయం కీలకం!

నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు వేర్వేరు వర్గాలుగా పనిచేస్తున్నారన్న చర్చ నేపథ్యంలో.. పార్టీ శ్రేణులను ఒకే వేదికపైకి తీసుకురావడం నాయకత్వానికి సవాలుగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో తిరుపతిరెడ్డి తన వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయనకు పెరుగుతున్న మద్దతు పార్టీలోని అంతర్గత రాజకీయ సమీకరణాలపై చర్చకు దారితీస్తోంది.

సీనియర్ల పాత్రపై ప్రశ్నలు.. కార్యకర్తలకు ప్రాధాన్యం ఎక్కడ?

పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న కొందరి వ్యవహారశైలిపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని ఆశించే నాయకత్వం.. వారికి తగిన గుర్తింపు, బాధ్యతలు, ప్రాధాన్యం కల్పించడంలోనూ అదే చొరవ చూపాలన్న వాదన వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అవకాశాలు కల్పించకుండా, పదవులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత నాయకుల వివరణ వెలువడాల్సి ఉంది.

కడివెడు పాలల్లో కశికెడు పేడ పడితే మొత్తం పాల విలువ తగ్గినట్లుగా.. కొందరి వ్యవహారశైలి మొత్తం నాయకత్వానికి ఇబ్బందిగా మారకూడదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత ఆధిపత్యాల కంటే పార్టీ ప్రయోజనాలు, కార్యకర్తల సంక్షేమం, నాయకుల మధ్య సమన్వయమే ముఖ్యమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

ప్రజల విశ్వాసమే అసలైన బలం!

రాజకీయాల్లో ఎదుగుదల అనేది కేవలం పదవులతోనే నిర్ణయించబడదు. ప్రజలకు అందుబాటులో ఉండటం, కార్యకర్తల కష్టాల్లో తోడుగా నిలవడం, నాయకులను కలుపుకొని పనిచేయడం కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో తిరుపతిరెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత విస్తరించుకుంటూ ముందుకు సాగుతారా? పార్టీలోని విభేదాలను అధిగమించి సమన్వయానికి వేదికగా నిలుస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

నాయకుడి ఎదుగుదలకు కార్యకర్తలే బలం.. ఆ బలాన్ని నిలబెట్టుకోవడానికి సమన్వయమే మార్గం!

Spread the love

Related News

Latest News