సన్ షైన్ పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.

*ఐదు అడుగుల బతుకమ్మతో ఆకట్టుకున్న చిన్నారులు .

*పూల పండుగ విశిష్టతను వివరించిన కరస్పాండెంట్ కోడి వెంకన్న .

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 09 : చండూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ విద్యా సంస్థ సన్ షైన్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలను అత్యంత ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పాఠశాల యాజమాన్యం ఈ వేడుకలను ఏర్పాటు చేసింది.ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు తమ ఇళ్ల నుండి, పరిసర ప్రాంతాల నుండి సేకరించిన తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా, ఆకర్షణీయంగా బతుకమ్మలను పేర్చారు. ముఖ్యంగా విద్యార్థులు పేర్చిన ఐదు అడుగుల భారీ బతుకమ్మ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.అనంతరం పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ, ఉపాధ్యాయురాళ్ళు, విద్యార్థినులు అందరూ కలిసి వలయాకారంలో నిలబడి బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో పాఠశాల ప్రాంగణమంతా ఆనందోత్సవ వాతావరణాన్ని నింపారు. చిన్నారుల నృత్యాలు, పాటలతో సంబరాలు అంబరాన్నంటాయి.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల గొప్ప పండుగ బతుకమ్మ అని, తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలను ఏ విధంగా నిర్వహిస్తారో వివరించారు. ఎంగిలి పూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఒక్కొక్క రోజు బతుకమ్మకు గల పేర్లను, వాటి ప్రాముఖ్యతను, బతుకమ్మ విశిష్టతను విద్యార్థినీ విద్యార్థులకు తెలియజేసి, మన సంస్కృతిని కాపాడుకోవాలని సూచించారు. అంతేకాకుండా అత్యంత అందంగా ఐదు అడుగుల బతుకమ్మను పేర్చిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రవికాంత్, వైస్ ప్రిన్సిపాల్ వినయ్, బతుకమ్మ ఉత్సవాల నిర్వాహకులు రమేష్ తో పాటు ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Spread the love

Related News

Latest News