టిప్పర్‌ రూపంలో మృత్యువు.. ఇద్దరు టీచర్ల దుర్మరణం

  • బీబీగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం స్కూటీని ఢీకొన్న టిప్పర్‌
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయురాలు

ప్రతిపక్షం, సూర్యాపేట, నవంబర్ 22: టిప్పర్‌ లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరు మహిళా ఉపాధ్యాయుల ప్రాణాలను బలిగొంది. సూర్యాపేట పట్టణ పరిధిలోని బీబీగూడెం సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు టీచర్లు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను చివ్వెంల మండలంలోని మినీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ కోట్ల రజితారెడ్డి (44), అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గుగులోతు రక్మ (40)గా గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరూ ఒకే స్కూటీపై పాఠశాల నుంచి సూర్యాపేటకు బయలుదేరారు. బీబీగూడెం నుంచి మార్కెట్‌కు వెళ్లే మార్గంలో ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్‌ లారీ వారి స్కూటీని బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయురాలు ఒకేసారి మృతిచెందడంతో గురుకుల పాఠశాలలో విషాదం నెలకొంది. వారి కుటుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Related News