జీఓ నెం.6 ప్రకారం వేతనాలు చెల్లించాలి.. CITU డిమాండ్
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 17: షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్లో పనిచేస్తున్న కార్మికులకు జీఓ నెం.6 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయడంతోపాటు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్కు వినతిపత్రం అందజేసింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ. మల్లేశం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 2026 జూన్ 1 నుంచి అమలయ్యేలా కనీస వేతనాలపై జీఓ నెం.6 విడుదల చేసిందని తెలిపారు. రోజుకు 8 గంటల పనికి నిర్ణయించిన వేతనాలను యజమానులు తప్పనిసరిగా చెల్లించాలని కోరారు. అక్టోబర్ 1 నుంచి వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ (VDA) అమలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, షోరూములు, పెట్రోల్ బంకులు తదితర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని మల్లేశం ఆరోపించారు.
కొన్ని పరిశ్రమల్లో 12 గంటలపాటు పని చేయించుకుంటూ, ఎనిమిది గంటలకు చెల్లించాల్సిన వేతనం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ ఈ అంశంపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జీఓ నెం.6 అమలుకు పరిశ్రమలు, షాపింగ్ మాల్స్ తదితర సంస్థల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, కార్మికులకు దసరా బోనస్ చెల్లించడంతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 25న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాలో మెదక్ జిల్లా పారిశ్రామిక కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి, ఉపాధ్యక్షుడు ఏ. మహేందర్ రెడ్డి, కోశాధికారి నర్సమ్మ, విద్యుత్ రంగ నాయకులు చంద్రబానప్ప తదితరులు పాల్గొన్నారు.





























