కేజ్రీవాల్‌కు రూ.7 కోట్లు ఇవ్వాలంటూ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!

ప్రతిపక్షం, నవంబర్ 12, న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. రూ.7 కోట్లు ఇవ్వకపోతే కేజ్రీవాల్‌ను హత్య చేస్తామంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీలోని తిలక్ నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌కు ఫోన్ కాల్స్‌తో పాటు వాట్సాప్ సందేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

వివరాల ప్రకారం.. కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. రూ.7 కోట్లు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. ఈ బెదిరింపులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ బెదిరింపుల వెనుక నిజంగా ఆ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులే ఉన్నారా? లేదా మరెవరైనా వారి పేరును ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ వ్యవహారానికి సంబంధించి తిలక్ నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌కు ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు రావడంతో ఆయన ఈ నెల 6వ తేదీన పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను మరింత పెంచాలని పోలీసులను కోరినట్లు సమాచారం. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి బెదిరింపు సందేశాల మూలాలు, ఫోన్ కాల్స్‌కు సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related News

Latest News