‘అక్కా.. నేను ఉన్నాను’ అంటూ భరోసా.. ప్రజల నుంచి ప్రశంసలు
ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 11: పేద ప్రజలకు కష్టమొస్తే అండగా నిలవడమే నిజమైన నాయకత్వమని నిరూపించారు మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు. అర్ధరాత్రి వేళ ఓ మహిళ ఆస్పత్రిలో ఎదుర్కొంటున్న సమస్య గురించి తెలుసుకున్న ఆమె వెంటనే స్పందించి, స్వయంగా ఆస్పత్రికి వెళ్లి బాధితురాలికి ధైర్యం చెప్పడం పట్టణ ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.మెదక్ పట్టణానికి చెందిన కళ్యాణి అనారోగ్యంతో మెదక్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనకు ఎదురైన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆమె ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భూపతిరాజుకు ఫోన్ చేసి తన సమస్యను వివరించారు.వెంటనే స్పందించిన చైర్పర్సన్ అర్ధరాత్రి అయినప్పటికీ ఎంసీహెచ్ ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితురాలిని పరామర్శించి, వైద్యురాలు డాక్టర్ అరుణను కలిసి సమస్య వివరాలను తెలుసుకున్నారు. వైద్యురాలి సూచనల మేరకు రోగికి ఎలాంటి ఇబ్బంది లేదని వివరించి, భయపడాల్సిన అవసరం లేదంటూ ధైర్యం చెప్పారు. తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.
పేదల కష్టాల్లో తోడుగా..
సామాన్య ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకురాలిగా రాధిక భూపతిరాజు గుర్తింపు పొందుతున్నారు. ‘అక్కా.. నేను ఉన్నాను’ అంటూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ఆమె సేవాభావానికి నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలోనూ ఆస్పత్రికి వచ్చి పలకరించి, ధైర్యం చెప్పినందుకు కళ్యాణి కుటుంబ సభ్యులు చైర్పర్సన్కు కృతజ్ఞతలు తెలిపారు.
గతంలోనూ పట్టణంలోని డంపింగ్ యార్డులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పొగ వ్యాపించిన సమయంలో ఆమె వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని పట్టణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, అవసరమైన సమయంలో స్పందించే నాయకత్వం ప్రజలకు ఎంతో ధైర్యాన్నిస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు.































