‘తనిష్క్’ షోరూమ్‌ నుంచి 20కేజీల బంగారం ఎత్తుకెళ్లాడు!

ప్రతిపక్షం, నవంబర్ 12, చెన్నై: తమిళనాడులోని మధురైలో ప్రముఖ ఆభరణాల సంస్థ తనిష్క్ షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. మాస్క్ ధరించి వచ్చిన ఓ దుండగుడు షోరూమ్‌లోకి చొరబడి సుమారు 15 నుంచి 20 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. కొత్తగా ప్రారంభమైన షోరూమ్‌లో ఈ స్థాయిలో చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి సమయంలో మాస్క్ ధరించిన ఓ వ్యక్తి షోరూమ్ భవనంపైకి చేరుకున్నాడు. అక్కడి నుంచి పైకప్పు మార్గంలోకి ప్రవేశించి, లిఫ్ట్‌కు సంబంధించిన మార్గం ద్వారా షోరూమ్ లోపలికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడ ఉన్న బంగారు ఆభరణాలను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డాడు. షోరూమ్‌లో ఉన్న మొత్తం బంగారు ఆభరణాల్లో సుమారు 30 శాతం వరకు దుండగుడు ఎత్తుకెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. వాటి బరువు దాదాపు 15 నుంచి 20 కిలోలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ తనిష్క్ షోరూమ్‌ను కేవలం 15 రోజుల క్రితమే ప్రారంభించారు. ప్రారంభమైన కొద్ది రోజులకే ఇంత భారీ చోరీ జరగడంతో షోరూమ్ యాజమాన్యం ఆందోళనకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. షోరూమ్‌లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని దుండగుడి కదలికలను పరిశీలిస్తున్నారు.

నిందితుడు ఏ మార్గంలో షోరూమ్‌లోకి ప్రవేశించాడు? చోరీ చేసిన బంగారాన్ని ఎలా బయటకు తీసుకెళ్లాడు? ఈ ఘటనలో మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. చోరీకి గురైన ఆభరణాల ఖచ్చితమైన పరిమాణం, విలువపై పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. కొత్తగా ప్రారంభమైన తనిష్క్ షోరూమ్‌లో జరిగిన ఈ భారీ చోరీ ఇప్పుడు మధురైలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Latest News