- మూడేళ్లుగా గండితోనే గోస.. 1,200 ఎకరాలకు సాగునీరు కరువు!
- అడుగంటిన జలాలు.. ఆగిన చేపల వేట.. శాశ్వత మరమ్మతుల కోసం రైతుల ఎదురుచూపులు
ప్రతిపక్షం, మానకొండూర్, అక్టోబర్ 26: కరీంనగర్ జిల్లా, శంకరపట్నం, వీణవంక మండలాల రైతుల సాగునీటి అవసరాలు తీర్చాల్సిన కల్వల ప్రాజెక్టు సమస్యల వలయంలో చిక్కుకుంది. 2023 జూలైలో భారీ వర్షాలకు మత్తడి గండిపడగా, అప్పటి నుంచి ప్రాజెక్టు పునరుద్ధరణకు శాశ్వత చర్యలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 1,200 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకపోవడంతో వ్యవసాయంపై ప్రభావం పడుతోంది. ప్రాజెక్టు దిగువన ఉన్న ఐదు చెక్‌డ్యామ్‌లు ఎండిపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. చేపల పెంపకంపై ఆధారపడి జీవించే మత్స్యకారుల ఉపాధి కూడా దెబ్బతింది.
తాత్కాలిక పనులే తప్ప.. శాశ్వత పరిష్కారం ఏదీ?
2023 జూలైలో కురిసిన భారీ వర్షాలకు కల్వల ప్రాజెక్టు మత్తడికి గండి పడటంతో అధికారులు రింగ్‌బండ్ వేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయితే కొద్దికాలానికే మళ్లీ గండి పడటంతో ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులే ముందుకొచ్చి ట్రాక్టర్ల ద్వారా ఇసుక బస్తాలు తెప్పించి తాత్కాలిక అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వరద ఉద్ధృతికి ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో ఆయకట్టు రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి.
ఎండిన చెక్‌డ్యామ్‌లు.. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు
ప్రాజెక్టులో నీరు నిల్వ లేకపోవడంతో దిగువన ఉన్న ఐదు చెక్‌డ్యామ్‌లు ఎండిపోయాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు తగ్గిపోయి రైతులకు సాగునీటి ఇబ్బందులు పెరిగాయి. మరోవైపు ప్రాజెక్టులో చేపల పెంపకానికి అవకాశం లేకపోవడంతో వందలాది మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. చేపల వేట, పెంపకంపై ఆధారపడి కుటుంబాలను పోషించుకునే వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
ప్రాజెక్టు భూముల పరిరక్షణపై ఆందోళన
ప్రాజెక్టు ఎండిపోవడంతో శిఖం భూముల ఆక్రమణకు కొందరు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ట్రాక్టర్లతో భూములను చదును చేసి సాగు చేసేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నట్లు సమాచారం. ప్రాజెక్టు పునరుద్ధరణతోపాటు భూముల పరిరక్షణకు కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అసెంబ్లీలో ప్రస్తావన.. మరమ్మతులకు మోక్షమెప్పుడు?
కల్వల ప్రాజెక్టు దుస్థితిని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవల శాసనసభలో ప్రస్తావించారు. ప్రాజెక్టుపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, మత్స్యకారుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టును మినీ ఎల్ఎండీగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని పేర్కొంటూ, వెంటనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సైతం ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు.
ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూపులు
ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రెండేళ్లుగా కోరుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని రైతులు, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కల్వల ప్రాజెక్టును పునరుద్ధరించి ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు చెక్‌డ్యామ్‌లలో నీటి నిల్వలు పెంచి, మత్స్యకారులకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






























