పార్టీ జెండాలు పక్కనపెట్టి.. సమాజ అభ్యున్నతికి ఐక్యంగా కదలాలి!

రజకుల సంక్షేమమే లక్ష్యంగా పోరాడాలి

విజయ గణేశ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రజక రిజర్వేషన్ సమితి

నంగునూరు మండల అధ్యక్షుడిగా బండి మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక

ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబర్ 16: రాజకీయ పార్టీలకు అతీతంగా రజక సమాజ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ గణేశ్ పిలుపునిచ్చారు. జాతి ఐక్యతే బలమని, హక్కుల సాధనకు సంఘటిత పోరాటమే మార్గమని పేర్కొన్నారు. నంగునూరులో శుక్రవారం నిర్వహించిన రజక సంఘం మండల కమిటీ ఎన్నికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రజకుల బతుకులు మారాలి

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా రజకుల జీవితాల్లో ఆశించిన మార్పు రావడం లేదని విజయ గణేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా రజకుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. రజకుల సంక్షేమం కోసం ప్రతి రజక బిడ్డ కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య కోరారు. రాజకీయాలకు అతీతంగా సమాజ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

మండల కమిటీ ఎన్నిక

జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో నంగునూరు మండల అధ్యక్షుడిగా బండి మల్లేశం (సిద్ధన్నపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా గుండెల్లి మల్లయ్య(ఖానాపూర్), సుంకరి మహాదేవ్ (ఘనపూర్) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వర్కోలు బాగయ్య, పావురాల సాయి చరణ్, అనరాజు చందు (నంగునూరు) నియమితులయ్యారు.ప్రధాన కార్యదర్శిగా పులిపాక సంపత్ (నాగరాజుపల్లి), కోశాధికారిగా కంచర్ల రాజు (కోనాయిపల్లి), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నర్మెట లక్ష్మణ్ (ఆంక్షపూర్), కార్యదర్శిగా బస్వరాజు భాస్కర్ (కొండంరాజుపల్లి) నియమితులయ్యారు. యూత్ అధ్యక్షుడిగా అనురాజు మహేశ్ (సిద్ధన్నపేట), యూత్ ప్రధాన కార్యదర్శిగా రాచకొండ రామ్ (బద్దిపడగ), యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భాస్కర్ (ఆంక్షాపూర్) ఎంపికయ్యారు. జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడిగా బస్వరాజు రాములు (పాలమాకుల), జిల్లా కన్వీనర్‌గా అనరాజుల నాగరాజు (నంగునూరు) నియమితులయ్యారు.

నాలుగో మహా సభను విజయవంతం చేయాలి

నవంబరు నెలలో నిర్వహించనున్న తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నాలుగో మహా సభను విజయవంతం చేయాలని విజయ గణేశ్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రజకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జాతి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. రజకుల సంక్షేమం, హక్కుల సాధన కోసం సమష్టిగా కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దిటి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ముత్యాల సత్య స్వామి, జిల్లా మీడియా కన్వీనర్ జూపల్లి నర్సింలు, మండలంలోని వివిధ గ్రామాల రజకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News