సైబరాబాద్‌లో వీకెండ్‌ స్పెషల్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌

282 మందిపై కేసులు నమోదు.. వాహనదారులపై పోలీసుల కొరడా!

సైబరాబాద్‌, ప్రతిపక్షం,నవంబర్‌ 15: వీకెండ్‌ వేళ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝళిపించారు. కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేకంగా చేపట్టిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 282 మంది పట్టుబడినట్లు ట్రాఫిక్‌ ADCP (అడ్మిన్‌) జి. నరేందర్‌ వెల్లడించారు.

ఈ తనిఖీల్లో 233 మంది ద్విచక్ర వాహనదారులు, 11 మంది ఆటో డ్రైవర్లు, 36 మంది కార్ల డ్రైవర్లు, ఇద్దరు భారీ వాహనాల డ్రైవర్లు పట్టుబడ్డారు. వీరిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.

బీఏసీ పరీక్షల్లో మద్యం మోతాదు ఇలా..

పట్టుబడిన వారిలో 232 మందికి 36 నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్‌, 39 మందికి 201 నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్‌, 11 మందికి 301 నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్‌ వరకు రక్తంలో ఆల్కహాల్‌ శాతం ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. నిందితులందరినీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు

మద్యం సేవించి వాహనాలు నడపడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమై ప్రాణనష్టం జరిగితే భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)-2023లోని సెక్షన్‌ 105 కింద కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేరానికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గత వారం 185 కేసుల పరిష్కారం

ఇదిలా ఉండగా, నవంబర్‌ 9 నుంచి 14 వరకు నమోదైన 185 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులను న్యాయస్థానాలు పరిష్కరించాయి. వీరిలో 15 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష, 9 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ, మరో 161 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్‌ పోలీసు అధికారులు వెల్లడించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు సూచించారు.

Related News

Latest News