రాజకీయ విమర్శలు చేస్తే ప్రాణహాని బెదిరింపులా?

  • కాంగ్రెస్‌ నేత మచ్చ శ్రీనివాస్‌కు ఫోన్‌లో బెదిరింపులు.. కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు
  • దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు.. తనకు, కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

ప్రతి పక్షం, దుబ్బాక, నవంబర్ 09: రాజకీయ విమర్శల నేపథ్యంలో తనకు ఫోన్‌ ద్వారా ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్‌ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్‌,కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దుబ్బాక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పనితీరు, అవినీతి ఆరోపణలు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై తాను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నలు లేవనెత్తుతున్నానని శ్రీనివాస్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోతె గ్రామానికి చెందిన కొత్త రాజిరెడ్డి అనే వ్యక్తి ఫోన్‌ ద్వారా తనను బెదిరించడంతోపాటు, అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించారు.

మరోసారి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, తన అంతు చూస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యుల గురించి వ్యక్తిగతంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, ఫోన్‌ సంభాషణలను రికార్డు చేసి బెదిరింపు సందేశాలను వివిధ వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో వివరించారు.రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను అడ్డుకోవడంతోపాటు,తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్ తునికి సురేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరాం నరేందర్,ఏఎమ్ సి డైరెక్టర్ ఆకుల భరత్,నాయకులు వెంకటచారి, పోగుల రాజిరెడ్డి,గోపి తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News