ప్రతిపక్షం, జూలై 27: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ (ఎస్సార్ఎస్పీ) ప్రాజెక్టు వద్ద ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన నలుగురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నీటిలో పడిన యువకుల కేకలు విన్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో నలుగురు మృతదేహాలను వెలికితీశారు.
మృతులను నిజామాబాద్ జిల్లాకు చెందిన కలీమ్, నజావత్, అజీమ్తో పాటు మరో యువకుడిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన నేపథ్యంలో ప్రాజెక్టులు, జలాశయాలను సందర్శించే పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.


















