వార్తలు రాయాలి.. కార్యక్రమాలు కవర్ చేయాలి.. కానీ ప్రకటనల డబ్బులు అడగొద్దా?
సంగారెడ్డిలో పీఆర్వోల పేరుతో సాగుతున్న వ్యవహారంపై చర్చఈ వ్యవహారం జగ్గారెడ్డికి తెలుసా?
ప్రతిపక్షం స్టేట్బ్యూరో, హైదరాబాద్, అక్టోబర్16: సంగారెడ్డిలో కాంగ్రెస్ రాజకీయాల్లో జగ్గారెడ్డి కీలక నేత. అయితే ఆయన పీఆర్వోలమని చెప్పుకొంటున్న కొందరి వ్యవహారశైలి ఇప్పుడు జర్నలిస్టుల్లో అసంతృప్తికి కారణమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాయకుల కార్యక్రమాలను కవర్ చేయాలి.. వార్తలు ప్రచురించాలి.. పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. కానీ ఇచ్చిన ప్రకటనల డబ్బుల గురించి అడిగితే మాత్రం దుర్భాషలాడతారా? ఇదేనా జర్నలిస్టులకు ఇచ్చే గౌరవం? ప్రకటనలు ఇచ్చిన తర్వాత వాటికి సంబంధించిన చెల్లింపుల గురించి ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారన్న ఆరోపణలు మీడియా వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ వ్యవహారాలన్నీ జగ్గారెడ్డికి తెలుసా? ఆయన పేరును ఉపయోగించుకుంటూ కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వార్తలు కావాలి.. జర్నలిస్టులంటే చిన్నచూపా?
రాజకీయ నాయకులకు, పార్టీలకు మీడియా అవసరం ఎంతైనా ఉంటుంది. పార్టీ సమావేశాలు, నాయకుల పర్యటనలు, జన్మదిన వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు.. ఇలా ప్రతి కార్యక్రమాన్నీ పత్రికల్లో ప్రచురించుకోవాలనే ఆసక్తి నేతలకు ఉంటుంది. ఇందుకోసం ప్రకటనలు ఇచ్చి వార్తలకు ప్రచారం కల్పించుకుంటారు. అయితే ప్రకటనల విషయంలో ఇచ్చిన హామీల ప్రకారం డబ్బులు చెల్లించాలనే విషయాన్ని మాత్రం కొందరు విస్మరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. చెల్లింపుల గురించి జర్నలిస్టులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి, బూతులతో విరుచుకుపడుతున్నారనే ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం నాయకులు చేసే ఉపకారం కాదు. అది ఒక వాణిజ్య లావాదేవీ. ప్రకటన ప్రచురించిన సంస్థకు సంబంధిత మొత్తాన్ని చెల్లించడం కనీస బాధ్యత. ఆ డబ్బులు అడిగినందుకు జర్నలిస్టులను కించపరచడం, అసభ్యంగా మాట్లాడటం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. వార్తలు కావాలంటే జర్నలిస్టులు గుర్తుకొస్తారు.. ప్రకటనలు ప్రచురించాక చెల్లింపులు అడిగితే మాత్రం వారి పట్ల చిన్నచూపు ఎందుకు? పత్రికల సేవలు కావాలి.. కానీ వాటి వెనుక పనిచేసే జర్నలిస్టుల గౌరవం అవసరం లేదా? అన్న ప్రశ్నలకు సంబంధిత వ్యక్తులు సమాధానం చెప్పాల్సి ఉంది.
జగ్గారెడ్డికి తెలుసా?
పార్టీ పదవిలో ఉన్న జగ్గారెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షలు తదితరాల్లో పాల్గొంటున్నా, ఆయనతో సంబంధం ఉందని చెప్పుకొంటున్న కొందరి వ్యవహారాలపై ఎవరూ ప్రశ్నించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, నాయకుల కార్యక్రమాలకు ప్రాధాన్యం కల్పించుకోవడం ఒక ఎత్తయితే.. మీడియా ప్రతినిధులతో గౌరవంగా వ్యవహరించడం మరో ఎత్తు. రెండింటికీ మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఉంది. జగ్గారెడ్డి పేరును చెప్పుకొంటున్న వారు నిజంగానే ఆయన తరఫున వ్యవహరిస్తున్నారా? జర్నలిస్టులను దూషిస్తున్నారన్న ఆరోపణలు ఆయన దృష్టికి వెళ్లాయా? ప్రకటనల చెల్లింపుల విషయంలో తలెత్తుతున్న వివాదాలపై ఆయన వైఖరి ఏమిటి? ఈ ప్రశ్నలకు స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు తమ వాదనను వెల్లడించాల్సిన అవసరమూ ఉంది. నాయకుల పేర్లను ఉపయోగించుకుంటూ మీడియా ప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారనే అభిప్రాయం ఏర్పడితే అది సంబంధిత నాయకులకూ ఇబ్బందికరమే. జర్నలిస్టులు వార్తలు రాయాలి.. ప్రకటనలు ప్రచురించాలి.. కార్యక్రమాలకు ప్రచారం కల్పించాలి. అదే సమయంలో తమ సంస్థలకు రావాల్సిన డబ్బులను అడిగే హక్కు కూడా వారికి ఉంది. ఆ హక్కును ప్రశ్నించినందుకు దూషణలు ఎదుర్కోవాల్సి వస్తే మీడియా స్వేచ్ఛ, వృత్తిగౌరవం గురించి మాట్లాడటం అర్థరహితమవుతుంది. సంగారెడ్డిలో ఈ వ్యవహారంపై సంబంధిత నాయకత్వం దృష్టి సారించి, ఆరోపణలపై స్పష్టత ఇవ్వడంతోపాటు జర్నలిస్టులతో గౌరవప్రదమైన సంబంధాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.





























