పంట చేతికొచ్చే సమయంలో వర్షం.. అన్నదాతలకు కన్నీళ్లే మిగిల్చింది
నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులుకంఠారెడ్డి తిరుపతిరెడ్డి
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 26: మెదక్ జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురిచేసింది. ఆరుగాలం కష్టపడి, వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో వర్షం రూపంలో ప్రకృతి విపత్తు రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. పంట కోతలు పూర్తిచేసి ధాన్యం తూకం వేసే సమయంలో వర్షం కురవడంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, ఇతర పంటలు తడిసిపోయాయి.ఆరు నెలల పాటు కుటుంబ సభ్యులతో కలిసి కష్టపడి పండించిన పంటలు కళ్లముందే తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు పెట్టుబడులు, కూలీల ఖర్చులు, ఎరువులు, విత్తనాల ధరలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అకాల వర్షం మరింత భారంగా మారింది.
చేతికొచ్చిన పంట నష్టపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కోరారు. జిల్లా వ్యాప్తంగా వర్షానికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా నష్టం అంచనా వేయాలని సూచించారు.పంట నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి పారదర్శకంగా నివేదిక రూపొందించాలని, అర్హులైన బాధిత రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు తీవ్రంగా నష్టపోయిన ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జాప్యం చేయకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టి అన్నదాతలకు అండగా నిలవాలని కంఠారెడ్డి తిరుపతిరెడ్డి విజ్ఞప్తి చేశారు.



























