‘స్పృహ తప్పినంత పనైంది’- ‘మన్మోహన్’ ఎంపిక వెనుక అసలు కథ చెప్పేసిన సోనియా!

ప్రతిపక్షం, నవంబర్ 10: 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి విజయం సాధించిన తర్వాత దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక పరిణామాలపై కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అప్పట్లో ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు ఆమె నిరాకరించడం, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేరును ప్రతిపాదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, అప్పటి కుటుంబ పరిస్థితులు, పార్టీ నేతల ఒత్తిడి, మన్మోహన్‌ సింగ్‌ను ఎంపిక చేయడానికి దారితీసిన అంశాలను తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో సోనియా వివరించారు. సుమారు 22 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలను ఆమె ఈ పుస్తకంలో గుర్తుచేసుకున్నారు.

2004 ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రధానమంత్రి పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు సోనియా వెల్లడించారు. ఈ విషయాన్ని తన పిల్లలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో కూడా చర్చించినట్లు తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే ప్రధాని అవుతారా? అని వారు ప్రశ్నించినప్పుడు తాను కచ్చితంగా ఆ పదవిని చేపట్టబోనని స్పష్టంగా చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీల హత్యలతో తమ కుటుంబం ఎదుర్కొన్న విషాదాలను ఆమె ప్రస్తావించారు. చిన్న వయసులోనే నానమ్మ, తండ్రిని హత్యల్లో కోల్పోయిన రాహుల్‌, ప్రియాంకలు.. తాను ప్రధానమంత్రి అయితే తన భద్రత విషయంలోనూ ఆందోళన చెందేవారని వివరించారు. తన పిల్లల భయాలు, కుటుంబ పరిస్థితులు కూడా ప్రధాని పదవికి దూరంగా ఉండాలన్న నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలిపారు.

ఎన్నికలకు ముందే తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తే కాంగ్రెస్‌లో నాయకత్వంపై చర్చలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉందని భావించి ఆ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సోనియా పేర్కొన్నారు. ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించిన తర్వాత కూటమి నేతలు తన నివాసానికి వచ్చి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు వెల్లడించారు. నేతల ఒత్తిడి మధ్య ఒక దశలో తాను అంగీకరించినట్లుగా కనిపించినా, అంతర్గతంగా మాత్రం తీవ్రంగా ఆలోచిస్తున్నానని చెప్పారు. ఈ పరిణామాలను కిటికీ నుంచి గమనించిన ప్రియాంక వెంటనే రాహుల్‌కు సమాచారం ఇచ్చినట్లు గుర్తుచేశారు. తన తల్లి ప్రధాని పదవిని చేపట్టాలని ఒత్తిడి చేస్తున్నారా? అలా జరిగితే తమ పరిస్థితి ఏమిటని రాహుల్‌ ప్రశ్నించినట్లు సోనియా తన ఆత్మకథలో వివరించారు.

తన ఇటలీ మూలాలను బీజేపీ, దాని మిత్రపక్షాలు రాజకీయంగా ప్రస్తావించే అవకాశం ఉందని కూడా సోనియా భావించినట్లు తెలిపారు. తాను ప్రధాని అయితే విదేశీ మూలాల అంశాన్ని రాజకీయంగా ముందుకు తీసుకువచ్చి దేశంలో వివాదాలు, ఉద్రిక్తతలు సృష్టించే అవకాశం ఉందని ఆందోళన చెందినట్లు పేర్కొన్నారు. తాను ప్రేమించే దేశంలో అలాంటి పరిస్థితులు ఏర్పడటం ఇష్టం లేదని వివరించారు. ఈ అంశాలన్నింటిపై రాత్రంతా ఆలోచించిన తర్వాత చివరకు తన అంతరాత్మ చెప్పిన నిర్ణయాన్నే అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మరుసటి రోజు ఉదయం రాహుల్‌ గాంధీ గదికి వెళ్లి తన నిర్ణయాన్ని చెప్పగా, ఆయన తనను హత్తుకుని సరైన నిర్ణయం తీసుకున్నారని అభినందించినట్లు సోనియా వెల్లడించారు.

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలోనూ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆమె గుర్తుచేసుకున్నారు. సోనియా గాంధీనే ప్రధానమంత్రి కావాలని కోరుతూ పలువురు ఎంపీలు పోడియం చుట్టూ చేరి నినాదాలు చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో నాయకులు, ఎంపీల ఒత్తిడి మధ్య ఒక దశలో ఊపిరాడనంత పరిస్థితి ఏర్పడి స్పృహ తప్పినంత పనైందని పేర్కొన్నారు. అయినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని స్పష్టం చేశారు. అధికారం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, దేశ లౌకిక పునాదులను కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని పార్టీ నేతలకు వివరించినట్లు తెలిపారు. చివరకు తన నిర్ణయాన్ని అంగీకరించేలా కాంగ్రెస్‌ నాయకులను ఒప్పించినట్లు ఆత్మకథలో పేర్కొన్నారు.

ఇక తన స్థానంలో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు మన్మోహన్‌ సింగ్‌నే ఎందుకు ఎంపిక చేశారన్న విషయాన్ని కూడా సోనియా వివరించారు. కాంగ్రెస్‌లో పలువురు సీనియర్‌ నాయకులు ఆ పదవికి అర్హులుగా ఉన్నప్పటికీ, దేశాన్ని నడిపించేందుకు మన్మోహన్‌ సింగ్‌ సరైన వ్యక్తిగా తనకు కనిపించారని తెలిపారు. ఆయనకు పాలనాపరమైన అంశాలపై లోతైన అవగాహన ఉందని, ఆర్థిక వ్యవస్థపై మంచి పట్టు ఉందని పేర్కొన్నారు. గతంలో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో దేశంలో అనేక కీలక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన అనుభవం ఆయనకు ఉందని గుర్తుచేశారు. మన్మోహన్‌ సింగ్‌ వ్యక్తిత్వం, నిజాయతీ, నిబద్ధతపై తనకు పూర్తి విశ్వాసం ఉండేదని వివరించారు.

మన్మోహన్‌ సింగ్‌ కాంగ్రెస్‌లోని ఏ ప్రత్యేక వర్గానికీ అనుబంధంగా లేని వ్యక్తి కావడం కూడా ఆయన ఎంపికకు ఒక కారణమని సోనియా తెలిపారు. అప్పట్లో యూపీఏ ప్రభుత్వానికి వామపక్ష పార్టీల మద్దతు ఉన్న నేపథ్యంలో ఆర్థిక విధానాల విషయంలో సమన్వయం అవసరమని భావించినట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వం సరైనదని నిర్ణయించుకున్నట్లు వివరించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి పంజాబ్‌లోని ఓ మారుమూల గ్రామం నుంచి ఉన్నత విద్యను అభ్యసించి ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాల స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణాన్ని కూడా సోనియా ప్రస్తావించారు. పండితుడిగా, ఆర్థికవేత్తగా ఆయన సాధించిన విజయాలతో పాటు వ్యక్తిగత నిజాయతీ, దయాగుణం తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందనే నమ్మకంతోనే ఆయన పేరును ప్రతిపాదించినట్లు వెల్లడించారు.

మన్మోహన్‌ సింగ్‌ పేరును ప్రతిపాదించినప్పుడు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదని సోనియా పేర్కొన్నారు. అయితే స్వయంగా మన్మోహన్‌ సింగ్‌ను కలిసి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాలని కోరినప్పుడు ఆయన తొలుత అంగీకరించలేదని గుర్తుచేసుకున్నారు. 2004లో సోనియా గాంధీ ప్రధాని పదవిని తిరస్కరించి మన్మోహన్‌ సింగ్‌కు బాధ్యతలు అప్పగించడం భారత రాజకీయ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. తాజాగా తన ఆత్మకథలో ఆమె వెల్లడించిన ఈ విషయాలు అప్పటి రాజకీయ పరిణామాలపై మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Related News

Latest News