[t4b-ticker]

హైదరాబాద్‌లో దారుణం.. గర్భిణీ ప్రియురాలిని హత్య చేసి పరార్

ప్రతిపక్షం, ఆగస్టు 18: హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన గర్భిణీ ప్రియురాలిని యువకుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం.. బాలాపూర్‌కు చెందిన అహ్మద్‌తో రెహానా అనే యువతి కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. వీరిద్దరూ సుమారు నాలుగు నెలల పాటు బయట కలిసి ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో రెహానా కుటుంబ సభ్యులు ఆమెను అహ్మద్‌తో కలిసి ఉండేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇటీవల అహ్మద్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు.

ఈ క్రమంలో రెహానా రెండు నెలల గర్భంతో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె అహ్మద్‌ను కోరినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తగా.. ఆగ్రహానికి గురైన అహ్మద్ ఆమె వీపుపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

హత్య అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఎలా మాయం చేయాలనే దానిపై అహ్మద్, అతని తల్లి అయేషా ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల రాకను గమనించిన అహ్మద్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

ప్రస్తుతం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న అహ్మద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News