‘Gen Z నిరసనల రీల్స్ అసహ్యంగా ఉన్నాయి’.. యువతపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు

ప్రతిపక్షం, జూలై 28: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న Gen Z నిరసనల వీడియోలు, రీల్స్‌పై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరం యువత ప్రవర్తన, భాష, వ్యక్తీకరణ తీరు అత్యంత అసభ్యకరంగా ఉందంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఘాటుగా స్పందించారు.

తన జీవితంలో ఒకే చోట ఇంత వికృతమైన ప్రవర్తనను ఎప్పుడూ చూడలేదని కంగనా వ్యాఖ్యానించారు. నిరసనల పేరుతో రూపొందిస్తున్న రీల్స్‌లో వినిపిస్తున్న మాటలు, ఉపయోగిస్తున్న భాష, ప్రవర్తన అన్నీ చాలా అసహ్యంగా ఉన్నాయని అన్నారు. అలాంటి వీడియోలు సమాజానికి మంచి సందేశం ఇవ్వకుండా, అసభ్యతను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు.

“ఈ యువతను ఎవరు పెంచుతున్నారు? ఎవరు ఇలాంటి సంస్కారం నేర్పుతున్నారు?” అని ప్రశ్నించిన కంగనా, కొందరు తమను తాము “బొద్దింకలు”తో పోల్చుకుంటున్నారని, నిజంగానే వారి ప్రవర్తన కూడా అలానే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సమాజంలో అసభ్యత, వికృత సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని నిరసనల రీల్స్ తనను తీవ్రంగా కలచివేశాయని, వాటిని చూడటం కూడా అసహ్యంగా అనిపించిందని చెప్పారు. యువత తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో హద్దులు పాటించాలని, స్వేచ్ఛ పేరుతో సంస్కారాన్ని కోల్పోవద్దని పరోక్షంగా సూచించారు.

కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. కొందరు ఆమె అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు యువతపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీంతో ఆమె పోస్టు మరోసారి సోషల్ మీడియా వేదికగా రాజకీయ, సామాజిక చర్చలకు కారణమైంది.

Spread the love

Related News

Latest News