యాసంగిలో ఆరుతడి పంటలే వేయండి – మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 02: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సిర్దెపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఎంఏవో మల్లేష్ మాట్లాడుతూ… రానున్న యాసంగి సీజన్ లో రైతులు ఉన్నటువంటి తక్కువ నీటి వనరులను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని, వరి పంటను సాగు చేయకుండా ఉండాలని కోరారు.ఒక కేజీ వరి ధాన్యం పండించడానికి దాదాపు 3000 లీటర్ల నీళ్లు అవసరమవుతాయని, ప్రస్తుత ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు సరిగ్గా కురవలేదని, ఎక్కడా కూడా చెరువులు గానీ కుంటలు గానీ నిండలేదని, దీని ప్రభావం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని తెలిపారు.

కాబట్టి రైతు సోదరులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో బోర్లు ఉన్న రైతులు ఆరుతడి పంటలైన పెసర్లు, మినుములు, మొక్కజొన్న, జొన్నలు, నువ్వులు, ఆముదాలు మరియు కూరగాయలు పండించుకోవాలని తెలియజేశారు. వీటికి వరి పంటతో పోలిస్తే చాలా తక్కువ నీరు అవసరమవుతాయని తెలిపారు.మండలంలో ఇంకా కొంతమంది రైతులు ఫార్మర్స్ రిజిస్ట్రీ చేసుకోలేదని, చేసుకోని రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దామెర రాములు, వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ సెక్రటరీ ఆంజనేయులు మరియు ఇతర రైతులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News