ప్రతిపక్షం, నవంబర్ 11: తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తరహాలో 10+2 విద్యావిధానాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రస్తుత విద్యావ్యవస్థను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ను విలీనం చేయనున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే మెరుగైన విద్యతోపాటు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే నైపుణ్యాలను అందించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని వివరించారు.
విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలకు అనుగుణంగా వారికి అవసరమైన విద్యను అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా 12వ తరగతి నుంచి నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సీఎం వెల్లడించారు. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, విద్యార్థులు ఉన్నత విద్యతోపాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను కూడా పొందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కల్పించడంతోపాటు రాష్ట్ర విద్యావ్యవస్థను జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.





























