•చికెన్ తిన్న 40 మందికి పైగా విద్యార్థినులకు అస్వస్థత!
•ఫుడ్ పాయిజన్‌పై పలు అనుమానాలు
•గుట్టుచప్పుడు కాకుండా వైద్య పరీక్షలు చేపిస్తున్న హాస్టల్ వార్డెన్
•ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 08, ప్రతిపక్షం: చికెన్ తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో పెబ్బేరు మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో కలకలం రేపుతుంది. బుధవారం రాత్రి డిన్నర్‌లో చికెన్ తిన్న అనంతరం సుమారు 40–50 మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. దీంతో కొందరిని హాస్టల్ నిర్వాహకులు పెబ్బేరు పీహెచ్‌సీకి తరలించి వైద్య పరీక్షలు చేయించినట్లు తెలిసింది. అయితే అస్వస్థతకు కారణం ఫుడ్ పాయిజనా.. వైరల్ ఫీవరా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. హాస్టల్ నిర్వాహకులు మాత్రం వైరల్ ఫీవర్ కారణంగానే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు.
హెల్త్ క్యాంప్‌పై భిన్న వాదనలు
హాస్టల్‌లో ముందుగానే హెల్త్ క్యాంప్ నిర్వహించామని, అందులో 22 మంది విద్యార్థినులకు వైరల్ ఫీవర్ ఉన్నట్లు గుర్తించామని హాస్టల్ నిర్వాహకులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే కళాశాల ప్రిన్సిపల్‌ను ఇదే విషయమై ప్రశ్నించగా.. హెల్త్ క్యాంప్ నిర్వహించిన విషయం తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. దీంతో అసలు హెల్త్ క్యాంప్ జరిగిందా? విద్యార్థినులకు ఏ కారణంతో అస్వస్థత ఏర్పడింది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫుడ్ పాయిజన్‌పై అనుమానాలు
విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం బయటకు రావడంతో స్థానిక జర్నలిస్టులు, ఏబీవీపీ నాయకులు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఫుడ్ పాయిజన్ విషయాన్ని కప్పిపుచ్చి వైరల్ ఫీవర్‌గా చెబుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. విద్యార్థినుల అస్వస్థతకు కారణాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షలతోపాటు హాస్టల్‌లోని ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అధికారులు విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
విద్యార్థినిని కారులో ఆస్పత్రికి..
విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి తదితరులు కళాశాలను సందర్శించి విద్యార్థినులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని కాళ్లు, చేతులు సరిగ్గా పనిచేయడం లేదని ఇబ్బంది పడుతుండటాన్ని గుర్తించారు. అక్కడే ఉన్న టీవీ5 రిపోర్టర్ విజయ్ వెంటనే స్పందించి ఆమెను కిందికి తీసుకొచ్చారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ చైర్మన్ కారులో ఆమెను పెబ్బేరు పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం 108 అంబులెన్స్‌ల ద్వారా పలువురు విద్యార్థినులను పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు.
తల్లిదండ్రుల్లో ఆందోళన
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థినులు ఈ హాస్టల్‌లో ఉంటున్న నేపథ్యంలో ఘటనపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థినుల అస్వస్థతకు అసలు కారణాన్ని తేల్చడంతోపాటు హాస్టల్‌లో అందిస్తున్న ఆహారం, తాగునీరు, పరిశుభ్రత ప్రమాణాలను అధికారులు పరిశీలించాలని వారు కోరుతున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.






























