మూసీ ప్రక్షాళనకు అన్ని అనుమతులు.. త్వరలో టెండర్లు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, నవంబర్ 12: హైదరాబాద్ నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులు లభించాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 55 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మూసీ నదిని దశలవారీగా పునరుజ్జీవింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా తొలివిడతలో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి, ప్రక్షాళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. మూసీ నది ప్రక్షాళన అనేది కేవలం సుందరీకరణ కార్యక్రమం కాదని, హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్తు తరాల జీవన ప్రమాణాలతో ముడిపడిన కీలకమైన ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంట చెరువును ఆధునిక సదుపాయాలతో పునరుద్ధరించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలోని చెరువులను ఆక్రమణల నుంచి విముక్తి చేసి వాటి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. చెరువుల పరిరక్షణ కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. తమ్మిడికుంట చెరువును పునరుద్ధరించే సమయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా, భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కోపం లేదని, ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని, ప్రకృతిని కాపాడటమే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.

తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణలో సినీనటుడు అక్కినేని నాగార్జున అందించిన సహకారాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. గతంలో సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును 30 ఎకరాల వరకు విస్తరించి సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో నాగార్జున పెద్దమనసుతో ముందుకొచ్చి రెండు ఎకరాల స్థలాన్ని అందించడం అభినందనీయమని అన్నారు. సమాజం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు నిజమైన హీరోలని, నాగార్జున సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ హీరోగా నిలిచారని కొనియాడారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సహకరించే వారిని గౌరవిస్తామని గతంలోనే ప్రకటించామని, అందులో భాగంగానే కార్యక్రమానికి వచ్చిన వెంటనే నాగార్జునను శాలువాతో సత్కరించినట్లు వెల్లడించారు.

హైదరాబాద్ నగరానికి చెరువులు, రాతి నిర్మాణాలు ప్రత్యేక గుర్తింపునిచ్చాయని సీఎం గుర్తుచేశారు. ఒకప్పుడు నగరంలో సుమారు 1,372 చెరువులు ఉండేవని, వివిధ కారణాలతో వాటిలో దాదాపు 50 శాతం కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాలకు వలస వచ్చిన పేదలు జీవనాధారం కోసం చెరువుల పరిసరాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, కొందరు అక్రమంగా భూములను ఆక్రమించడం, ప్రభుత్వాల నిర్లక్ష్యం వంటి అనేక కారణాలతో జలవనరులు క్రమంగా కనుమరుగయ్యాయని చెప్పారు. ప్రస్తుతం తమ్మిడికుంటతో పాటు బతుకమ్మకుంట, బుమ్-రుక్నుద్దౌలా, సున్నం చెరువు, నల్లచెరువు, ఫాక్స్ సాగర్, మియాపూర్ చెరువు సహా సుమారు 20 చెరువులను పునరుద్ధరించి సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో వందల ఎకరాల్లో విస్తరించి ఉండాల్సిన చెరువులు ఆక్రమణల కారణంగా కుంచించుకుపోయాయని పేర్కొన్నారు.

నగరంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రోడ్లు నీటమునగడం, గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడం వెనుక చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికావడం కూడా ప్రధాన కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. నీరు నిల్వ ఉండాల్సిన ప్రాంతాలను మనమే ఆక్రమించుకుంటే, చివరకు ఆ నీరు మన నివాస ప్రాంతాల్లోకి వస్తుందని వ్యాఖ్యానించారు. దీని వల్ల పేదలు, బస్తీల్లో నివసించే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ప్రకృతి ప్రవాహానికి అడ్డంకులు సృష్టించడం వల్లే వరదల సమయంలో అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చెరువులు, నాలాలు, నదులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

1908లో హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన భారీ వరదలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సమయంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిజాం నవాబు దీర్ఘకాలిక పరిష్కారం కోసం ఆలోచించి అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచి ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను వినియోగించుకున్నారని తెలిపారు. ఆయన సూచనల మేరకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించారని, 1920 నాటికి ఈ జలాశయాలు పూర్తయ్యాయని వివరించారు. వందేళ్ల క్రితం నిర్మించిన ఈ రిజర్వాయర్లు ఇప్పటికీ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని చెప్పారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి పాలకులు తీసుకున్న నిర్ణయాలు నేటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.

నిజాం కాలంలోనే మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని సీఎం తెలిపారు. మూసీ నది వెంట పురానాపూల్ వంతెన, సిటీ కాలేజీ, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, బ్రిటిష్ రెసిడెన్సీ వంటి అనేక చారిత్రక నిర్మాణాలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. ఒకప్పుడు మూసీ పరిసర ప్రాంతాలు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉండేవని చెప్పారు. అయితే కాలక్రమేణా ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపకపోవడంతో నది పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, చివరకు మూసీ నది ఉనికికే ప్రమాదం ఏర్పడే స్థాయికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన మూసీని తిరిగి పునరుజ్జీవింపజేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.

మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒకవైపు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ప్రజలకు మరోవైపు మూసీ కాలుష్యం అదనపు సమస్యగా మారిందని చెప్పారు. మూసీ నీటి కాలుష్యం కారణంగా రైతులు, స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితులను స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడానని తెలిపారు. తమ ప్రాంతంలో కాలుష్యం కారణంగా వ్యవసాయం, ప్రజల జీవన పరిస్థితులు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటే మూసీ నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో నదుల పునరుజ్జీవనంతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని సీఎం గుర్తుచేశారు. గుజరాత్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్, ఉత్తరప్రదేశ్‌లో గంగా నది, ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు అభివృద్ధి చెందాయని, నదుల చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు విస్తరించాయని చెప్పారు. దక్షిణ కొరియాలో నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి 24 గంటల పాటు ఆర్థిక కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకున్నారని ఉదాహరణగా వివరించారు. హైదరాబాద్‌లోనూ మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థికాభివృద్ధికి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు.

మూసీ ప్రక్షాళనలో భాగంగా నదిలో పేరుకుపోయిన కాలుష్యాన్ని తొలగించడం, నీటి నాణ్యతను మెరుగుపరచడం, భూగర్భ జలాలను పెంపొందించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీ నది మురికికూపంగా మారడానికి మానవ తప్పిదాలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా కారణమని వ్యాఖ్యానించారు. నదిలో మనుషుల మృతదేహాలు, పశువుల కళేబరాలు, ఇతర వ్యర్థాలు చేరడం వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. మూసీ అభివృద్ధి విషయంలో వ్యక్తిగత, రాజకీయ భేషజాలను పక్కనపెట్టి ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు.

మూసీ ప్రక్షాళన కారణంగా ఎవరికైనా నష్టం జరిగితే వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రాజెక్టు అమలులో ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని, బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. మూసీ నది అభివృద్ధి వల్ల హైదరాబాద్ నగరానికే కాకుండా దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

తమ్మిడికుంట చెరువును పునరుద్ధరించిన తర్వాత దాని నిర్వహణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. సరైన నిర్వహణ లేకపోతే మళ్లీ చెరువు పూర్వపు పరిస్థితికి చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్‌తో పాటు ఇందిరా మహిళా శక్తి సంఘాల మహిళలు చెరువు నిర్వహణలో భాగస్వాములు కావాలని సూచించారు. చెరువు పరిసరాల్లో మహిళా శక్తి ఆధ్వర్యంలో చిన్నచిన్న వ్యాపారాలు, స్టాళ్లు ఏర్పాటు చేసి స్థానిక మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించాలని చెప్పారు. ఈ విధంగా చెరువుల చుట్టూ పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా అభివృద్ధి చెందేలా లేక్ ఎకానమీని ప్రోత్సహించాలని సూచించారు.

తమ్మిడికుంట చెరువును కేవలం పర్యాటక ప్రాంతంగా కాకుండా హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. గ్రామాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడిన ప్రజలు తమ సంప్రదాయాలను కొనసాగించుకునేందుకు ఈ ప్రాంతం ఉపయోగపడాలని చెప్పారు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలను ప్రజలు ఇక్కడ జరుపుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా చెరువు పరిసరాల్లో జమ్మి చెట్టును నాటాలని అధికారులకు తెలిపారు. తమ్మిడికుంట నిర్వహణలో మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో చెరువును దీర్ఘకాలం పాటు పరిరక్షించవచ్చని పేర్కొన్నారు.

పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీనటుడు అక్కినేని నాగార్జున విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి, శాసనమండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మూసీ ప్రక్షాళనకు అన్ని అనుమతులు లభించడంతో త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుండటం, తొలి విడతలో 21 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించడం ఈ కార్యక్రమంలో ప్రధాన ప్రకటనలుగా నిలిచాయి.

Related News

Latest News