రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా కరీంనగర్ పట్టణంలో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల ప్రారంభం
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 29: కరీంనగర్ నగర ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టనున్న సిటీ బస్సులను నేడు బుధవారం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు తక్కువ ఖర్చుతో సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి . కరీంనగర్-2 డిపో పరిధిలో ఈ సిటీ బస్సులు మొదటిదశలో 3 బస్సులు ప్రారంభించనున్నారు. క్రింది రూట్లలో నడవనున్నాయి.
- కరీంనగర్ – వాగేశ్వరి కాలనీ
- కరీంనగర్ – చింతకుంట
- కరీంనగర్ – కొత్తపల్లి హవేలీ సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులను నడుపనున్నది.
ఈ సేవలు అందుబాటులోకి ప్రధాన మార్గాల్లో వస్తుండగా, ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని రూట్లకు సిటీ బస్సు సేవలను విస్తరించనున్నారు.నగరంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు మరియు నివాస ప్రాంతాలను అనుసంధానించే విధంగా ఈ బస్సుల సేవలు అందుబాటులో ఉండనున్నాయి, తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కలుగుతుంది. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ప్రజా ప్రతినిధులు ,ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

















