జేఎల్‌ఎల్ జీసీసీ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, ఆగస్టు 06: గత 20 నెలల కాలంలో తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 150 గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి లభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో జేఎల్‌ఎల్ (JLL) సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ను గురువారం నాడు ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు అనువైన ప్రాంతాలను గుర్తించి సిఫారసు చేసే సంస్థగా జేఎల్‌ఎల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అలాంటి సంస్థ హైదరాబాద్‌ను తన జీసీసీ కేంద్రంగా ఎంచుకోవడం తెలంగాణ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ ఐటీ కార్యకలాపాలు మార్పులకు లోనవుతున్న తరుణంలో, ఇన్నోవేషన్ ఆధారిత జీసీసీలు భవిష్యత్ ఉపాధికి ప్రధాన కేంద్రాలుగా అవతరిస్తున్నాయని చెప్పారు. కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్ ప్రభావంతో సాంకేతిక రంగంలో మార్పులు వచ్చినా, జీసీసీల ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు.తెలంగాణలో జీసీసీల వేగవంతమైన విస్తరణకు అత్యుత్తమ మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పరిశ్రమలకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణాలన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్ ఎంత కీలక పాత్ర పోషించిందో, ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్, ఏఐ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు భవిష్యత్ పెట్టుబడులకు బలమైన పునాది వేస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, ఏఐ, డీప్‌టెక్, అధునాతన సాంకేతిక రంగాలకు అవసరమైన మానవ వనరులను రాష్ట్రం సిద్ధం చేస్తోందన్నారు.
హైదరాబాద్‌కు 16% జాతీయ వాటా
2024 నుంచి 2026 మధ్య దేశవ్యాప్తంగా జీసీసీల కార్యాలయ లీజింగ్‌లో హైదరాబాద్ వాటా 16 శాతంగా నమోదైందని మంత్రి తెలిపారు. అదే సమయంలో నగరంలో జరిగిన మొత్తం కార్యాలయ లీజింగ్‌లో జీసీసీల వాటా 42 శాతానికి చేరుకోవడం హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థలో వాటికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాలకు చెందిన జీసీసీల ఏర్పాటులోనూ హైదరాబాద్ తొలి ఎంపికగా నిలుస్తోందని పేర్కొన్నారు. దీంతో ఐటీ కేంద్రంగా మాత్రమే కాకుండా, అత్యాధునిక సాంకేతిక రంగాల్లోనూ ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు వేదికగా నగరం ఎదుగుతోందన్నారు.
1,600 మందికి ఉద్యోగాలు
జేఎల్‌ఎల్ ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే వచ్చే రెండేళ్లలో సుమారు 1,600 మందికి ఉపాధి లభించనుంది. ఫైనాన్స్, మానవ వనరులు, ప్రాజెక్టు నిర్వహణ, లీజ్ అడ్మినిస్ట్రేషన్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్, టెక్నాలజీ ఆధారిత సేవలను ప్రపంచవ్యాప్తంగా జేఎల్‌ఎల్ కార్యకలాపాలకు ఈ కేంద్రం సేవలను అందిస్తుంది.కార్యక్రమంలో జేఎల్‌ఎల్ ఇండియా సీఈఓ రాధా ధిర్, హైదరాబాద్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్, గ్లోబల్ సర్వీస్ సెంటర్ హెడ్ ధీరజ్ పోప్లీ, ఐటీ శాఖ సలహాదారు సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

















