ప్రతిపక్షం, సెప్టెంబర్ 05: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి సిద్ధమవుతుండగా.. మరోవైపు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ భారీ ఆందోళనకు సిద్ధమవుతోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వం తీరును ఎండగట్టాల్సిన అంశాలు, ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించే విధానం తదితర అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలదీయడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశాల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్‌పై రాజకీయంగా ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతోంది. కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో రేపు హైదరాబాద్‌లో మహాధర్నా చేపట్టనుంది. ఈ ఆందోళన ద్వారా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ వెయ్యి రోజుల జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రావడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను లక్ష్యంగా చేసుకుని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తోంది. దీంతో రేపు జరిగే బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం, కాంగ్రెస్ నిర్వహించనున్న మహాధర్నా రెండూ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకే అంశంపై రెండు ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటుండటంతో అసెంబ్లీ సమావేశాల్లోనూ వాడీవేడీ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇరు పార్టీలు తమ రాజకీయ వ్యూహాలను పదును పెడుతుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఒకవైపు కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే అంశంపై వ్యూహరచన చేయనుండగా.. మరోవైపు కాంగ్రెస్ ఆయన ఎమ్మెల్యే పదవిపై ప్రశ్నలు లేవనెత్తుతూ మహాధర్నాకు సిద్ధమవుతోంది. దీంతో అసెంబ్లీ సమావేశాలకు ముందే రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కాయి.





























