ప్రతిపక్షం, జూలై 23: దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇంటర్మీడియట్ భాషా ప్రశ్నపత్రం, ఎస్‌ఎస్‌సీ భాషా ప్రశ్నపత్రం లీక్ అయినట్లు నడ్డా పేర్కొన్నారు. అలాగే జమ్మూ కశ్మీర్‌లో సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్ష, హిమాచల్ ప్రదేశ్‌లో ఎస్‌ఈబీ పరీక్ష, ఝార్ఖండ్‌లో హిందీ, సైన్స్ ప్రశ్నపత్రాలు, తమిళనాడులో బీఈడీ కోర్సు పరీక్ష, పశ్చిమ బెంగాల్‌లో పోలీస్ నియామక పరీక్ష, పంజాబ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ వివిధ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయిన ఘటనలను ఆయన ప్రస్తావించారు.
ఈ రాష్ట్రాల్లో చాలా చోట్ల ఎన్డీయేతర ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని నడ్డా వ్యాఖ్యానించారు. ప్రశ్నపత్రాల లీకేజీని రాజకీయ కోణంలో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సమస్యగా చూడాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.


















