ప్రతిపక్షం, ఆగస్టు 19: మాజీ ప్రియుడితో ఎదుర్కొన్న అనుభవాల గురించి నటి అనుపమ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన మానసిక వేధింపుల గురించి ఆమె తాజాగా పలు విషయాలను వెల్లడించారు. మహిళగా తన భావాలను, శారీరక పరిస్థితులను అవమానించేలా మాజీ ప్రియుడు మాట్లాడేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి నెలా వచ్చే రుతుక్రమం విషయంలోనూ తనను సిగ్గుపడేలా చేసేవాడని అనుపమ తెలిపారు. రుతుక్రమం సమయంలో ఉన్నావా? ఇంకా రాలేదా? మూడ్ స్వింగ్స్ కదా? అంటూ చులకనగా మాట్లాడేవాడని చెప్పారు. అతడు చేసే తప్పులను ప్రశ్నించినప్పుడు కూడా తనతో దారుణంగా మాట్లాడేవాడని ఆమె ఆరోపించారు.
ఈ అనుభవాల ప్రభావం తన ఆలోచనా విధానంపైనా తీవ్రంగా పడిందని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు తనకు 11 మంది పిల్లలు ఉండాలని కలలు కనేదాన్నని, అయితే ఎదురైన పరిస్థితుల కారణంగా చివరకు పిల్లలే వద్దనే స్థితికి చేరుకున్నానని తెలిపారు.
మహిళగా పుట్టినందుకు ఇలాంటి మాటలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందా అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తన అనుభవాలను పంచుకోవడం ద్వారా సంబంధాల్లో మానసిక వేధింపులు ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఆమెకు మద్దతుగా పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. వ్యక్తిగత సంబంధాల్లో పరస్పర గౌరవం, భావోద్వేగ భద్రత ఎంతో ముఖ్యమని పేర్కొంటున్నారు.





























