ప్రతిపక్షం, నవంబర్ 17: తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న విద్యావ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకొచ్చే ముందు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. మేధావులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ముందడుగు వేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఇంటర్ బోర్డును రద్దు చేస్తామంటే అంగీకరించబోమని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్న డ్రాప్అవుట్ల గణాంకాలు సరైనవి కావని విమర్శించారు.
ఇంటర్మీడియట్ బోర్డు రద్దు నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకించడం లేదని, అయితే ఇలాంటి మార్పులు ఒక్కసారిగా అమలు చేయడం సాధ్యం కాదని కవిత పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి కనీసం మూడు నుంచి పదేళ్ల వరకు సమయం తీసుకుని, దశలవారీగా ప్రక్రియను కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. పరిపాలనా సంస్కరణలను విద్యా సంస్కరణలుగా భావించకూడదని ప్రభుత్వానికి హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే ముందు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు.
పదో తరగతి పూర్తిచేసిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరే విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలను కవిత ప్రశ్నించారు. పదో తరగతి నుంచి ఇంటర్‌కు వెళ్లే ప్రతి పది మంది విద్యార్థుల్లో ఆరుగురే కొనసాగుతున్నారని ప్రభుత్వం చెబుతోందని, ఈ గణాంకాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు సంబంధించినవి అయి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తం విద్యార్థుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే డ్రాప్అవుట్ల శాతం 16గానే ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆ తర్వాత ప్రైవేటు విద్యాసంస్థల్లోనో, ఇతర విద్యా కోర్సుల్లోనో చేరుతున్నారని గుర్తుచేశారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల గణాంకాలను ఆధారంగా చేసుకుని మొత్తం విద్యావ్యవస్థపై నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.
విద్యార్థులు చదువును మధ్యలోనే మానేయడానికి అనేక కారణాలు ఉన్నాయని కవిత వివరించారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, గ్రామీణ ప్రాంతాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వంటి సమస్యలు డ్రాప్అవుట్లకు ప్రధాన కారణాలుగా ఉన్నాయని చెప్పారు. నీతి ఆయోగ్ కూడా విద్యార్థులు చదువును కొనసాగించలేకపోవడానికి పలు కారణాలను ప్రస్తావించిందని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా చదువుకు దూరమవుతున్న పరిస్థితిని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించాలని సూచించారు. విద్యార్థులను తిరిగి విద్యావ్యవస్థలో కొనసాగించేలా ఆర్థిక సహాయం, రవాణా సదుపాయాలు, ఇతర ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా గుజరాత్లో అమలు చేస్తున్న నమో లక్ష్మి పథకాన్ని కవిత ప్రస్తావించారు. చదువును మధ్యలో మానేసే పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే విధానాలను తెలంగాణలోనూ అమలు చేయాలని సూచించారు. గుజరాత్లో ఈ పథకం కింద ఏటా రూ.928 కోట్లను విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తున్నారని, దాని ఫలితంగా డ్రాప్అవుట్లలో 16 శాతం తగ్గుదల నమోదైందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెడితే విద్యార్థులు ఆర్థిక కారణాలతో చదువును ఆపేయకుండా ప్రోత్సహించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇంటర్లో చేరే విషయంలో బాలికలే ఎక్కువగా చదువుకు దూరమవుతున్నారని ముఖ్యమంత్రి చెబుతున్న గణాంకాలు కూడా తప్పుగా ఉన్నాయని కవిత విమర్శించారు. పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌కు చేరుతున్న బాలికల శాతం 77.4గా ఉంటే, బాలుర శాతం 68.4గా ఉందని తెలిపారు. ఈ గణాంకాల ప్రకారం బాలికల కంటే బాలురే ఎక్కువగా ఇంటర్ విద్యకు దూరమవుతున్నారని ఆమె వాదించారు. బాలురలో చదువుపై నిర్లక్ష్యం, గంజాయి వినియోగం వంటి అంశాలు కూడా సమస్యకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.
విద్యార్థులు చదువును మధ్యలో ఆపేస్తున్న సమస్యకు పరిష్కారం కనుగొనకుండా ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు రావని కవిత అభిప్రాయపడ్డారు. విద్యార్థుల సమస్యలు, విద్యాసంస్థల పరిస్థితులు, తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు, గ్రామీణ ప్రాంతాల్లోని సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే విద్యా సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటర్ బోర్డు భవిష్యత్తుపై అన్ని వర్గాలతో చర్చించి, దీర్ఘకాలిక ప్రణాళికతో నిర్ణయం తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.




























