జాతీయస్థాయి పోటీలకు హిమజ, భరత్ ఎంపిక
ప్రతిపక్షం ప్రతినిధి,సిద్ధిపేట, అక్టోబరు 13: గట్కా క్రీడల్లో సిద్ధిపేట క్రీడాకారులు ప్రతిభ చాటారు. మంగళ వారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి గట్కా పోటీల్లో సత్తా చాటి ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సిద్ధిపేటలో మెరిడియన్, క్రాంతి పాఠశాలల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సుద్దాల హిమజ, లింగంపల్లి భరత్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సుద్దాల హిమజ ప్రస్తుతం మెరీడియన్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నది. లింగంపల్లి భరత్ క్రాంతి హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. వీరి విజయంతో జిల్లాలో క్రీడాభిమానులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు జాతీయ స్థాయి గట్కా క్రీడలకు ఎంపిక కావడం పట్ల హిమజ తల్లిదండ్రులు సుద్దాల సంగీత, శ్రీనివాస్ తల్లి , భరత్ తల్లిదండ్రులు లింగంపల్లి నవీన, రామస్వామి ఆనందం వ్యక్తం చేశారు.
గట్కా విస్తరణకు విశేష కృషి
సిద్ధిపేట జిల్లాలో గట్కా క్రీడ అభివృద్ధికి గట్కా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ సిద్ధిపేట జిల్లా కార్యదర్శి మోతుకు నరేశ్ కుమార్ కృషి చేస్తున్నారు.విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రోత్సాహం అందిస్తున్నారు. క్రీడాకారులకు శిక్షణ కల్పిస్తూ ఉన్నత స్థాయి పోటీలకు సిద్ధం చేస్తున్నారు. హిమజ, భరత్ ల ఎంపిక ఆయన కృషికి గుర్తింపుగా నిలిచింది.
క్రీడాకారులకు అభినందనలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధిపేట జిల్లా కార్యదర్శి నర్ర భాస్కర రెడ్డి మాట్లాడుతూ హిమజ, భరత్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. జిల్లాలో గట్కా క్రీడను విస్తరించేందుకు నరేశ్ కుమార్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. మరింత మంది విద్యార్థులు ఈ క్రీడలో రాణించేలా ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయికి ఎంపికైన సుద్దాల హిమజ, ఎల్. భరత్‌లను పలువురు అభినందించారు. రాబోయే పోటీల్లోనూ విజయం సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హిమజ తల్లిదండ్రులు సుద్దాల సంగీత, శ్రీనివాస్ తల్లి , భరత్ తల్లిదండ్రులు లింగంపల్లి నవీన, రామస్వామి, గట్కా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోతుకు నరేశ్ కుమార్, రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, ప్రభుత్వ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






























