ప్రతిపక్షం, నవంబర్ 27: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు కీలక పదవి కేటాయించే అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ బీఎం సందీప్‌కుమార్ మధ్య చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే అంశంపై ఇద్దరూ సమాలోచనలు చేసినట్లు సమాచారం.
ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలా? లేక ఏఐసీసీ స్థాయిలో కీలక పదవి ఇవ్వాలా? అనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాధాన్యం కల్పించే దిశగా మంత్రి పదవి ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపైనా చర్చ జరిగినట్లు ప్రచారం సాగుతోంది.
మంత్రి పదవితో పాటు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను కూడా ఆయనకు కేటాయించే అంశాలు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రతిపాదనలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.



























