దేశభక్తితోనే బలమైన భారత నిర్మాణం
నంగునూరులో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పథసంచలన్
ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబర్ 19: దేశ సమైక్యత, రక్షణతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ్ బండి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు సూచించారు. ప్రతి వ్యక్తిలో దేశభక్తి భావాన్ని పెంపొందించినప్పుడే బలమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నంగునూరు ఖండ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పథసంచలన్ నిర్వహించారు. స్వయం సేవకులు క్రమశిక్షణతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బండి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ పునరుద్ధరణకు కృషి చేస్తోందని ఆయన అన్నారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల జీవితాలు నేటి తరానికి స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. వారి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భరత మాతను గౌరవిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.దేశంలో ఎక్కడ విపత్తులు సంభవించినా సేవా కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ ముందుంటుందని తెలిపారు. సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చాలని సూచించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నంగునూరు ఖండ కార్యవాహ రాగుల వీరారెడ్డితో పాటు పలువురు స్వయం సేవకులు పాల్గొన్నారు.




























