బాల్య వివాహ రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.

  • బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం – కలెక్టర్ స్పష్టం.
  • ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలి.
  • డిసెంబర్ 15 వరకు ప్రత్యేక నిఘా – అధికారులకు ఆదేశాలు.
  • జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.

ప్రతి పక్షం నల్గొండ నవంబర్ 29 : బాల్య వివాహ రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఇలాంటి సామాజిక రుగ్మతను పూర్తిగా నిర్మూలించేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్ లో బాల్య వివాహ నిషేధ చట్టం, బాల్య వివాహ ముక్త్ భారత్ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఆశ్రిత సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నల్లగొండ జిల్లాలో బాల్య వివాహ కేసులు అధికంగా ఉన్నాయని, వాటిని పూర్తిగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని అన్నారు.బాల్య వివాహాల నిర్మూలన కోసం గతంలో గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలు చేసిన కృషిని గుర్తుచేస్తూ, సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ చైతన్యంతో పనిచేయాలని సూచించారు.

  • 18 ఏళ్ల తర్వాతే పెళ్లి:

ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని, చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను నాశనం చేయవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.ఆడపిల్లలను కుటుంబానికి భారంగా భావించకుండా, వారికి నాణ్యమైన విద్య అందించి ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని అన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు అవసరమైన సహకారం అందించి, బాల్య వివాహాల వైపు వెళ్లకుండా చూడాలని సూచించారు.

  • *వరకట్నం కూడా నేరమే:

వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం కూడా చట్టరీత్యా నేరమని, కట్నం లేని వివాహాలను ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు.సమాజంలో అమ్మాయిల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా, వారి హక్కులను గౌరవించాలని అన్నారు.చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటుందని అన్నారు.గ్రామాలు, తండాలు, మున్సిపాలిటీలలో బాల్య వివాహాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

  • సమాచారం ఇస్తే వెంటనే చర్య:

ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే గుర్తించి, సంబంధిత కుటుంబాలకు చట్టపరమైన అంశాలు, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని చెప్పారు.గ్రామ కార్యదర్శులు తమ పరిధిలోని గ్రామంలో ఎంతమంది మైనర్లు ఉన్నారో వివరాలు సేకరించి, బాల్య వివాహాలు జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు.

  • డిసెంబర్ 15 వరకు ప్రత్యేక నిఘా:

ఈ సంవత్సరం డిసెంబర్ 15 వరకు వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, బాల్య వివాహాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో బాల్య వివాహాలు జరిగే సూచనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని చెప్పారు.

  • విద్యార్థులకు అవగాహన:

విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే శారీరక, మానసిక, ఆర్థిక నష్టాలను వివరించాలని, ముఖ్యంగా టీనేజ్ గర్భధారణ వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించాలని అన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ వంటి ఆరోగ్య కార్యక్రమాల సమయంలోనూ బాలికలకు ఆరోగ్యం, విద్య, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించాలని సూచించారు.

బాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ కార్యదర్శులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి బాలికకు విద్య, ఆరోగ్యం, భద్రత కల్పిస్తూ బాల్య వివాహాలు లేని జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లావణ్య కుమారి, ఆశ్రిత డైరెక్టర్ నాగరాజు, చైల్డ్ వెల్ఫేర్ స్టేట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ రాహుల్, సిడబ్ల్యూసి చైర్ పర్సన్ చింతకృష్ణ, జిల్లా కోఆర్డినేటర్ శివరాజ్, డీసీపీఓ గణేష్, సూపర్‌వైజర్లు, సీడీపీఓలు, ప్రజలు హాజరయ్యారు.

Related News

Latest News