ప్రతిపక్షం, నవంబర్ 28: భూ భారతి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో భూ భారతి, ప్రజావాణి, సీఎం ప్రజావాణి, పౌర సేవల ధ్రువీకరణ పత్రాల దరఖాస్తుల పరిష్కారం, ఇసుక అక్రమ తవ్వకాలు, భూ ఆక్రమణల నిర్మూలన, తదితర రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్న భూ భారతి, ప్రజావాణి, సీఎం ప్రజావాణి దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని చెప్పారు. దరఖాస్తులు తిరస్కరించబడితే, తిరస్కరణకు సంబంధించిన కారణాలు క్లుప్తంగా నమోదు చేయాలన్నారు. అర్జీదారులకు వివరాలు వెల్లడించాలని చెప్పారు. దరఖాస్తు వివరాలన్నీ తప్పనిసరిగా రికార్డుల రూపంలో నమోదు చేయాలని తెలిపారు. గడువులోగా దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలన్నారు. కుల, ఆదాయ, నివాస, తదితర పౌర సేవల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం చేయకూడదని ఆదేశించారు. ధ్రువీకరణ పత్రాల జారీ పారదర్శకంగా ఉండాలని అన్నారు.
జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను పూర్తి స్థాయిలో నిర్మూలించాలని పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగకుండా పకడ్బందీ నిఘా ఉంచాలన్నారు. ఎక్కడైనా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అవుతుందన్న సమాచారం అందితే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వివరించారు. అవసరమైతే పోలీసు సిబ్బంది సహకారం తీసుకోవాలని చెప్పారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వాహనాలు జప్తు చేసి, కేసులు నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని అన్నారు.
భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. ప్రక్రియలో ఎటువంటి తప్పులకు తావు ఉండకూడదని చెప్పారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






























