శివన్నగూడెం రిజర్వాయర్‌కు ‘ఏదుల’ నుండి నీటి తరలింపు: కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి భగీరథ ప్రయత్నం సఫలం.

*ఫలించిన రాజ్‌గోపాల్ రెడ్డి భగీరథ ప్రయత్నం.

*గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రతిపక్షంలో ఉండి పోరాటం.. ఇప్పుడు అధికార పక్షంలో ఉండి సాధన.

*రూ. 1,800 కోట్ల పరిపాలనా అనుమతులు, క్యాబినెట్ ఆమోదంతో పరుగుల పెడుతున్న పనులు.

*రాజ్‌గోపాల్ రెడ్డి రాజీనామాతోనే కదిలిన భూపరిహారం ఫైళ్లు.

*మునుగోడు, దేవరకొండల దశాబ్దాల కల సాకారం – రైతుల్లో హర్షాతిరేకం .

ప్రతి పక్షం మునుగోడు అక్టోబర్ 26 : దేవరకొండ మరియు మునుగోడు నియోజకవర్గాల ప్రజల దశాబ్దాల కల, ఈ ప్రాంతాల వరప్రదాయని అయిన డిండి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు పడింది. మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి నిరంతర కృషి, పట్టుదలతో శివన్నగూడెం రిజర్వాయర్‌కు మహబూబ్‌నగర్ జిల్లాలోని ‘ఏదుల రిజర్వాయర్’ నుంచే నీటిని మళ్లించేలా ప్రజా ప్రభుత్వం నుండి చారిత్రాత్మక నిర్ణయాన్ని సాధించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, రూ. 1,800 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు తీసుకురావడమే కాకుండా టెండర్లు పూర్తి చేయించి పనులను శరవేగంగా ముందుకు ఉరికించారు.

*నాడు కేసీఆర్ కాలయాపన – నేడు రాజ్‌గోపాల్ రెడ్డి కార్యాచరణ :

జూన్ 12, 2015న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శివన్నగూడెం రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసినప్పటికీ, కేవలం కమీషన్ల కోసమే కట్టలు తవ్వించి కాలయాపన చేశారు. నీటిని ఎక్కడి నుండి తీసుకురావాలో నిర్ణయించకుండానే ప్రాజెక్టును గాలికొదిలేశారు. దీనికంటే వెనకాల (మే 2, 2016 లో) మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును జూన్ 2019 నాటికే పూర్తి చేసిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నల్గొండ జిల్లాలో అత్యంత వెనుకబడిన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల ప్రాజెక్టులను ఘోరంగా నిర్లక్ష్యం చేసింది. నాడు పదేళ్లు అధికారంలో ఉన్న ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు తమ ఉనికి కోసం నాడు కేసీఆర్‌ను ప్రశ్నించలేక మూగనోము నోచారు.

*రాజీనామాతోనే లభించిన భూపరిహారం న్యాయం:

గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం భూనిర్వాసితులకు చకచకా ఎక్కువ పరిహారం అందజేసిన పాలకులు, శివన్నగూడెం రిజర్వాయర్ నిర్వాసితుల పట్ల తీవ్ర వివక్ష చూపారు. అతి తక్కువ పరిహారం ఇవ్వడమే కాకుండా దానిని కూడా సక్రమంగా చెల్లించలేదు. నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో నిర్వాసితుల తరఫున కొట్లాడిన రాజ్‌గోపాల్ రెడ్డి గారు, అనంతరం తన ఎమ్మెల్యే పదవికి చేసిన ‘చారిత్రాత్మక రాజీనామా’తో నాటి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఆయన రాజీనామా పుణ్యంతోనే అధికారులు గ్రామాలపై పడి శివన్నగూడెం భూనిర్వాసితులకు భూపరిహారం పూర్తి చేసి న్యాయం చేశారు.

*నిపుణులతో సమీక్షలు – మంత్రులతో క్షేత్రస్థాయి పరిశీలన:

శివన్నగూడెం రిజర్వాయర్‌కు శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు రాజ్‌గోపాల్ రెడ్డి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం సభ్యులతో గంటల తరబడి సాంకేతిక సమీక్షలు నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, స్వయంగా ఉపముఖ్యమంత్రి (ఆర్థిక శాఖ మంత్రి) శ్రీ భట్టి విక్రమార్క ని, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని డిండి కట్ట దగ్గరికి తీసుకెళ్లారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీరు రావాలంటే ఏదుల నుంచే సాధ్యమవుతుందని వాస్తవ పరిస్థితిని వివరించి, ఒప్పించి క్యాబినెట్ ఆమోదం సాధించారు.

*క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ:

ప్రస్తుతం ఏదుల నుండి శివన్నగూడెంకు నీటి తరలింపు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులపై ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పాటు, రిటైర్డ్ ఇంజనీరింగ్ ఫోరం సభ్యులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు మరియు ఇతర సాంకేతిక నిపుణులతో మాట్లాడుతూ స్టేటస్ తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా ఆటంకాలు ఎదురైతే వాటిని తక్షణమే అధిగమించేలా దిశా నిర్దేశం చేస్తున్నారు.
నాడు నల్గొండ జిల్లా ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ నాయకులు, నేడు తమ ఉనికి చాటుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్యేపై అవాకులు చవాకులు పేలుతున్నారని, వాటిని ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా, భవిష్యత్ తరాల బాగు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి కార్యాచరణపై నియోజకవర్గ ప్రజలు, రైతాంగం పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

Spread the love

Related News

Latest News