పశుసంపదను పెంచి రైతులకు అదనపు ఆదాయం కల్పించాలి

ఎల్‌నినో ప్రకృతి వైపరీత్యాన్ని సమష్టిగా ఎదుర్కోవాలి

సింగూరు జలాలు మెదక్ జిల్లా ప్రజల అవసరాలకే వినియోగించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 09: జిల్లాలో పశుసంపదను అభివృద్ధి చేసి రైతులకు అదనపు ఉపాధి మార్గాలను కల్పించాలని కార్మిక, గనుల శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎల్‌నినో ఒక ప్రకృతి వైపరీత్యమని, దాని ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని వర్గాల ప్రజలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సింగూరు జలాలను మెదక్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని స్పష్టం చేశారు.

సోమవారం నర్సాపూర్ మండలం రామచంద్రపురం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు వైద్య చికిత్స, అవగాహన కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశువులు, గొర్రెలకు గాలికుంటు వ్యాధి నివారణ, నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. జిల్లాలో పశువులు, గొర్రెలు, మేకలకు అందుతున్న వైద్య సదుపాయాలపై పశువైద్యులను అడిగి తెలుసుకున్నారు. గొర్రెల కాపరులు మంత్రికి గొర్రెను బహూకరించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణపై దృష్టి సారించి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో రైతులు వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేయాలని కోరారు. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 లక్షల బోర్లు ఉన్నాయని, అక్టోబర్ నెలలోనే 20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగించామని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయకపోతే రైతులు పంట నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రానికి సహాయం అందించాలని కోరుతామని వెల్లడించారు. గతంలో తన తండ్రి కాకా వెంకటస్వామి సాగునీటి కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పశు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధికి, గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం తక్కువగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ఈ సాగుకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు.సింగూరు జలాలను మెదక్ జిల్లా అవసరాలకే వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరానికి ఎల్లంపల్లి, గోదావరి, నాగార్జునసాగర్, హిమాయత్‌సాగర్ వంటి ప్రత్యామ్నాయ నీటి వనరులు ఉన్నాయని, మెదక్ జిల్లాకు మాత్రం సింగూరు ఒక్కటే ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు తాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పశుసంపద పెంపుతో పాటు పాల ఉత్పత్తిని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పశువులకు బీమా సౌకర్యం కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. పశుసంవర్ధక శాఖలో సిబ్బంది కొరతను పరిష్కరించాలని కోరారు. సింగూరు నీటిని పరిశ్రమలకు కాకుండా జిల్లా ప్రజల అవసరాలకు వినియోగించాలని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. జిల్లాలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, సర్పంచ్ గీతా నరేందర్, నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆదిత్య వర్మ, ఉప సర్పంచ్ నవీన్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related News

Latest News