ప్రతిపక్షం, నవంబర్ 10: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీన సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట్ స్వామి వెల్లడించారు. ఈ పథకాన్ని అర్హులైన వారందరికీ అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించడంతో పాటు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని మంత్రులు తెలిపారు.
ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్దిపేటలో పాల్గొననున్న బహిరంగ సభకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హైమవతి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. సభ నిర్వహణకు సంబంధించి మూడు, నాలుగు ప్రాంతాలను పరిశీలించినట్లు మంత్రి వివేక్ తెలిపారు. అందులో ఒక ప్రాంతాన్ని ఇప్పటికే ఖరారు చేసినట్లు వెల్లడించారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో వేదిక, పార్కింగ్, ఇతర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇలాంటి స్థాయిలో ఇళ్లను ఇతర ప్రాంతాల్లో నిర్మించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
మరోవైపు, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా చిలకపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ చీరలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మూడేళ్లలోగా ప్రకటించిన అన్ని పథకాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.
సిద్దిపేట సభ కేవలం పథకాల ప్రారంభానికే పరిమితం కాకుండా, ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే వేదికగా ఉంటుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. భవిష్యత్తులో అమలు చేయనున్న మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ముఖ్యమంత్రి ప్రకటనలు చేసే అవకాశం ఉందని చెప్పారు. సిద్దిపేటతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం నేపథ్యంలో అర్హతలు, లబ్ధిదారుల ఎంపిక, పథకం అమలు విధానం వంటి వివరాలపై ముఖ్యమంత్రి సభలో మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
























