బీజేపీ పెద్దపల్లి ఇంచార్జ్ రావుల రాం నాథ్..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూలై 03 : పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందూ సమాజానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ పెద్దపల్లి ఇంచార్జ్ రావుల రాంనాథ్ డిమాండ్ చేశారు. బుధవారం నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జీ) మండల కేంద్రంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ, బీజేవైఎంల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ప్రజా సంక్షేమంపై మాట్లాడాల్సింది పోయి.. మతాల గురించి చెబుతూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఉన్న రాహుల్ గాంధీ ఎన్నికలలో కనీసం తన పార్టీ ఎంపీల సంఖ్యను 100కు కూడా దాటించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఈ సందర్భంగా ఖండిస్తూ ఇకముందు రాహుల్ గాంధీ ఈ మాదిరి వ్యవహరిస్తే బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా తన పాత్రను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వర్తించుకోవలసి ఉందని చెప్పారు. ఆందోళన కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్ బీజేపీ, బీజేవైఎం ఆయా విభాగాల పదాధికారులు నాయకులు పాల్గొన్నారు.