బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీవి అన్నీ బోగస్ మాటలే.. ప్రజలను దగా చేయడమే వారి ఉద్దేశమని.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ అన్నారు. ఎన్నికల ముందు రైతులు ఎంత ధాన్యం పండించినా వరిపంటకు రూ. 500 బోనస్ ఇస్తామన్నరు.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమేనని దగా చేస్తున్నారు. రాష్ట్రంలో దొడ్డు వడ్లు పండించే మెజార్టీ రైతులకు మొండిచెయ్యి చూపించారని ఆయన మండిపడ్డారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసింది అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఒక్క సమీక్ష సమావేశం నిర్వహించలే.. రైతుల సమస్యలు తెలుసుకోలే.. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా అన్నారు.. ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు అన్నారు.. ఇచ్చింది లేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే రూ.2 లక్షల రుణమాఫీ అన్నారు.. ఆగస్టు పేరుతో పంగనామం పెట్టాలని చూస్తున్నరు. నిన్నటి కేబినెట్ మీటింగ్ లో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను (దశాబ్ధి ఉత్సవాలు) నిర్వహించేందుకు సోనియా గాంధీని ఆహ్వానిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ నిర్వహించేది దశాబ్ధి ఉత్సవాలా..? దశ దిశ లేని కాంగ్రెస్ పార్టీ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ఉత్సవాలా..? చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అసలు సోనియా గాంధీ గారిని ఏ హోదాలో ఆహ్వానిస్తున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.
సబ్బండ వర్గాల పోరాటంతోనే తెలంగాణ ఉద్యమం సాకారమైంది. కానీ ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు తమ ఖాతాలో వేసుకుంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ క్రీడ ఆడుతుంటటం సిగ్గుచేటు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది. దశాబ్ధి సంబురాల పేరుతో సుమారు రూ.500 కోట్లకు పైగా ప్రజాసొమ్మును వెచ్చించింది. గత ప్రభుత్వంలో పేదలకు డబల్‌బుడ్‌రూం ఇళ్లు రాలేదు, పంటలకు గిట్టుబాటు ధర రాలేదు, ఆసరా పింఛన్లు అందలేదు.. దళితబంధు ఇయ్యలేదు.. నిరుద్యోగ భృతి దక్కలేదు. కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో ప్రజలు బతకలేని తెలంగాణగా మార్చారు. నాడు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో చిక్కుకుంటే.. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల పేరుతో పార్టీ ప్రమోషన్లకు ప్రజల సొమ్మును దారిమళ్లించారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పంథాలో కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాలంటూ మరో ప్రమోషన్ కు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీ మొదటి నుంచి మద్దతిస్తూనే వచ్చింది. 2009లో బీజేపీ అధికారంలోకి వస్తే వందరోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని అద్వాణీ గారు స్పష్టంగా ప్రకటించారు.
2012లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు తెలంగాణ పోరు యాత్రతో ప్రజల్లో చైతన్యం నింపారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పోరుదీక్ష చేశారు. ముఖ్యంగా 2014లో తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. లోక్ సభలో బిల్లు ఆమోదం వేళ దివంగత సుష్మాస్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు ప్రధానపాత్ర పోషించారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ తెచ్చింది ఒకరని, రాష్ట్రాన్ని ఇచ్చింది ఒక పార్టీ అని ప్రజలను మభ్యపెట్టి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ విలాసాల కోసం, తమ రాజకీయ మనుగడ కోసం తెలంగాణ ప్రజల సెంటిమెంటుతో ఆటలాడుకోవడం దురదృష్టకరం. ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలు, హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా.. రైతులను క్షోభ పెడుతూ, ప్రజలను ఇబ్బందులు పెడుతూ మళ్లీ దశాబ్ధి ఉత్సవాల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం సరికాదు. పోరాటాలు, నిరసనలు, ధర్నాలు, ఉద్యమాలతో సాకారం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవాలకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కానీ ప్రజల సమస్యలు తీర్చకుండా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసం ప్రజలను సెంటిమెంట్ అస్త్రంగా వాడుకోవాలనుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ముందు ప్రజల సమస్యలు తీర్చి.. సంబురాలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.