మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో భాగంగా చేసిన వంద రోజుల పాలనకు ప్రజలు పట్టం కట్టారని, మమ్మల్ని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీ హరి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ ఎంపీలుగా గెలిచిన కడియం కావ్య, మల్లు రవి, చామల కిరణ్ తదితరులతో కలిసి మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్ల శాతం పెరిగిందన్నారు. తమ రెఫరెండంకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పోరాడిన కార్యకర్తలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కార్యకర్తలు తమ గౌరవాన్ని నిలబెట్టారన్నారు. బీజేపీ కోసం బీఆర్ఎస్ ఆత్మబలిదానం.
బీజేపీ కోసం బీఆర్ఎస్ నాయకులు అవయవదానం చేసారని, బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందన్నారు. 7 నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందని, పార్టీ పెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేటలో మెజారిటీ వచ్చిందని, సిద్దిపేటలో హరీష్ రావుకు పూర్తి పట్టున్నప్పటికీ తమ ఓట్లు బీజేపీకి వేయించారని, బీఆర్ఎస్ చేసిన కుట్రతోనే కాంగ్రెస్ 8 చోట్ల ఓడిపోడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మోడీ గ్యారంటీలకువారంటీ చెల్లు.. తక్షణమే రాజీనామా చేయాలి..
మోదీ గ్యారంటీకి ఉన్న వారంటీ అయిపోయిందని, ఆయన కాలం చెల్లిపోయిందని, మోదీ చరిష్మాతో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు తిరస్కరించిన మోదీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు విలువలు ఉంటే ప్రధాని పదవి నుండి హుందాగా తప్పుకోవాలన్నారు. ఈరోజు నుంచి మరో రెండు గంటలు అదనంగా పని చేస్తామని, రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా, ఏ సీటు ఓడినా తనదే బాధ్యత అని రేవంత్ రెడ్డి అన్నారు. గెలుపు ఓటములు తానే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. తమకు వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాగా ఉన్నాయని, వాటిని స్వీకరిస్తున్నానని అన్నారు.
కేసీఆర్ రాజకీయ జూదగాడు.. బీజేపీతో స్నేహం కోసం యత్నం.. కేసీఆర్ బీజేపీతో బేరసారాలు చేసుకుంటున్నారని, ఆత్మ ప్రబోధానుసారం బీఆర్ఎస్ నాయకులు నిర్ణయాలు తీసుకోవాలని సీఎం బీఆర్ఎస్ నాయకులను కోరారు . కేసీఆర్ రాజకీయ జూదగాడని, ఆయన రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉంటారని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు కేసీఆర్ అని ఆయనతో బీజేపీ స్నేహం ఎలా చేస్తోందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను బరిలోకి దింపి బీజేపీ నేతల గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన 22 ఓట్ల శాతాన్ని ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి బదిలీ చేశారని ధ్వజమెత్తారు. 2001 నుంచి 2023 వరకు సిద్దిపేటలో బీఆర్ఎస్కు మెజార్టీ వచ్చిందన్న రేవంత్ రెడ్డి, సిద్దిపేటలో బీఆర్ఎస్ ఓట్లను హరీశ్‌రావు బీజేపీకి బదిలీ చేయించారని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ ఓటింగ్ 16.5 శాతానికి పడిపోయిందన్నారు. అచేతనావస్థలో బీఆర్ఎస్ ఉందని, ఆ పార్టీకి మిగిలింది బూడిదే అంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న బీఆర్ఎస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. “వ్యవహార శైలిని కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు మార్చుకోవాలి. పార్టీ మనుగడకు, కుటుంబ స్వార్థం కోసం చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటామని, ఏపీతో ఉన్న ఆస్తులు, నీటి పంపకాలను చర్చించి పరిష్కరించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దేవుడు కూడా క్షమించలేదు..
రాముడి పేరుతో బీజేపీ రాజకీయం అందుకే ఆ పార్టీని దేవుడు కూడా క్షమించలేదు సీఎం రేవంత్ అన్నారు. మోదీ కాలం చెల్లిందని ప్రజలు తీర్పు ఇచ్చారు. అందుకే ఈ ఎన్నికల్లో మోదీ గ్యారంటీని దేశ ప్రజలు తిరస్కరించారు. ప్రధాని పదవికి తక్షణమే మోదీ రాజీనామా చేయాలి. మూడోసారి కూడా మోదీ ప్రధాని పదవి చేపడితే విలువలతో కూడిన రాజకీయాలు చేయనట్లే. మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.” అని అన్నారు. రాష్ట్రంలో వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేసింది. అందుకే ఆ పార్టీని రామయ్య కూడా క్షమించలేదు. అయోధ్య ఆలయం కొలువై ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమే దీనికి నిదర్శనం” అని రేవంత్ అన్నారు. నచ్చితే ఓటు వేయాలని లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను అడిగామని తెలిపారు. ‘కాంగ్రెస్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 2019లో 3 సీట్లు ఉంటే ఇప్పుడు ఆ మూడు కాస్త 8 ఎంపీ సీట్లుగా మారాయి.’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
నేను జల్లాకు సీఎంను కాదు.. రాష్ట్రానికి..
తాను జిల్లాకు ముఖ్యమంత్రిని కాదని రాష్ట్రానికి సీఎం అని, తన బాధ్యత రాష్ట్రానికి పరిమితమని రేవంత్ అన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు ఓటములకు తానే బాధ్యుడినన్న రేవంత్, తన జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివని అభివర్ణించారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే సమస్యలు పరిష్కరించుకుంటామని తాను గతంలోనే చెప్పానన్న సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు.
“ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే సమస్యలు పరిష్కరించుకుంటాం. ఈ విషయం గతంలోనే నేను చెప్పాను. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ చట్టపరంగా తేలిపోయింది. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు సంపూర్ణ రాజధాని. ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్దతో కూడుకున్న హామీ. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడ్డామని రాహుల్ పునరుద్ఘాటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయనే అనుమానులు ఉన్నాయని తెలిపారు.