Govt Announced Bonus For Singareni Workers: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఏడాదిలో సింగరేణికి రూ.4,701 కోట్లు లాభం వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌గా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1.90లక్షలు బోనస్ వస్తుందన్నారు. అలాగే ఒప్పంద ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సింగరేణి లాభాల్లో 33 శాతం బోనస్‌పై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు సైతం తమ వంతు పాత్ర పోషించారని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. గతేడాది కంటే రూ.20వేలు అదనంగా బోనస్ ప్రకటించామని, సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకూ బోనస్ ఇస్తున్నామన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారన్నారు. సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చిందన్నారు. దసరా కంటే ముందుగానే సింగరేణిలో లాభాల వాటా పంచడం ద్వారా కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని చూడాలనుకున్నామన్నారు.