ప్రతిపక్షం, కరీంనగర్ ఏప్రిల్ 6: కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఆ పార్టీది ‘ఆపన్న హస్తం కాదని, భస్మాసుర హస్తమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ‘పాంచ్ న్యాయ్’ పేరుతో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. తెలంగాణను 10 ఏళ్లపాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమన్నారు.
30 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏనాడూ సాయమందించని కేసీఆర్ సిగ్గు లేకుండా రైతులపట్ల ప్రేమను ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసపూరిత పార్టీలేనని, రైతులు, నేతన్నల దుస్థితికి రెండు పార్టీలే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని నేతన్నల దుస్థితికి నిరసనగా, వారిని ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్ తో ఈనెల 10న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిరిసిల్లో ‘దీక్ష’ చేస్తున్నట్లు ప్రకటించారు. నయీం ఆస్తులపై విచారణ జరపడంతోపాటు ఆస్తులను దోచుకున్న కేసీఆర్ కుటుంబంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.