Trending Now

‘సల్మాన్’ హత్య కుట్రలో బాలుడు


పోలీసుల చార్జిషీటులో సంచలనాలు
ప్రతిపక్షం నేషనల్ బ్యూరో, ముంబై, జూలై 2: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర చేసిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ తరువాత మంగళవారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ ఖాన్ ను చంపేందుకు నిందితులు 25 లక్షల రూపాయల సుపారీకి ఒప్పుకున్నారు. అనంతరం సల్మాన్ కదలికలపై నిఘా పెట్టిన బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరపాలని ప్లాన్ చేశారు. దీని కోసం పాకిస్తాన్ నుంచి ఏకే 47, ఏకే 92, ఎమ్ 16 రైఫిల్స్, టర్కిష్ తయారు చేసిన జిగానా పిస్టల్ కొనుగోలు చేశారు. సల్మాన్ ను చంపేందుకు ఉత్తర అమెరికా నుంచి ఒక బాలుడిని కూడా తీసుకువచ్చారు. ప్రణాళిక మొత్తం రూపొందాక బిష్ణోయ్ ఆదేశాల కోసం నిందితులు ఎదురు చూశారు. సల్మాన్ ఖాన్ కదలికలను గుర్తించడానికి బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఏకంగా 50 నుంచి 70 మందిని రంగంలోకి దించారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటివద్ద, పన్వేల్ లోని ఆయన ఫామ్ హౌస్ వద్ద, షూటింగ్ సెట్స్ వద్ద కూడా హీరో కదలికలను ఎప్పటికప్పుడు గమనించారు. రాజస్థాన్ కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ ఆయనను టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఆయనను చంపేందుకు పాకిస్తాన్ నుంచి ఆయుధాలను సేకరించింది.

Spread the love

Related News

Latest News