Trending Now

అబద్ధాల హామీల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది..

ప్రతిపక్షం, కరీంనగర్ ఏప్రిల్ 2: ఆచరణకు సాధ్యం కానీ.. అబద్ధాల హామీల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేయడంతో పాటు యాసంగి పంటకు ఎఫ్రీల్, మే మాసాల్లో క్వింటాలుకు ₹500ల బోనస్ ఇవ్వాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వేములవాడలోని కోనారావుపేట మండలం సుద్దాల, కనగర్తీ, నిమ్మపల్లి, బావుసాయిపేట గ్రామాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ₹500లకు సిలిండర్, మహిళలకు₹2500ల సాయం, కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, రైతుభరోసా ద్వారా₹15000 వంటి హామీలు ఇచ్చారని.. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు దాటినా కూడా అమలు చేయడం లేదని ఫైరయ్యారు.

తెలంగాణ రాక ముందు నీళ్లు, విద్యుత్ కోసం రైతులు ఇబ్బంది పడేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 7778 మెగావాట్లు ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్నీ 26వేలకు పెంచడం జరిగిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని, తెలంగాణ ఏర్పాటయ్యాక కాళేశ్వరం ద్వారా సాగునీళ్లు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం చేసి వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం జరిగిందన్నారు. 1.61లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని.. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను గుర్తించి, ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికలకు వారం రోజుల ముందుగానే రైతుబంధు కోసం ₹7700కోట్ల నిధులను సమకూర్చి పెడితే ఇప్పటి వరకు రైతులకు రైతుబంధు ఇప్పటి వరకు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ఇప్పుడు సాగునీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని.. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఫిల్లర్ల వద్ద కాఫర్ డ్యాం నిర్మాణం చేసి ఉంటే ఇయ్యల పంటలు నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, బీఆర్ఎస్ కార్యకర్తలందరికి పార్టీ అండగా ఉంటుందని.. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చల్మేడ లక్ష్మీ నర్సింహరావు, ఎంపీపీ చంద్రయ్య గౌడ్,పీఏసీఎస్ చైర్మన్లు బండ నర్సయ్య, రామ్మోహన్ రావు,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేవయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News