నిర్మల్‌లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
పట్టణ అధ్యక్షులు మారుగొండ రాము
ప్రతిపక్షం, నిర్మల్ జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 22 : తెలంగాణ తొలి బాపు ఉద్యమ వీరుడు కేసీఆర్ పదేళ్లపాటు తెలంగాణలో అమలు చేసిన వినూత్నమైన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను చూసి ఈ లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వీధులలో ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. కల్లిబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనే పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. 60 ఏళ్లు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ దేశాన్ని అభివృద్ధి బాటన నడిపిన పాపాన పోలేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పదంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకెళ్లిందని చెప్పారు. కుల, మతాలకు అతీతంగా సామరస్యత భావాలతో లౌకికవాద పరిరక్షణకు కేసీఆర్ దేశంలోనే అత్యంత విలువ ఇచ్చి సమన్యాయం, సమ సంక్షేమం పేరుతో ముందుకెళ్లారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యులు మొహమ్మద్ నజీరుద్దీన్, చారి మహమ్మద్ బిన్ అలీ, సయ్యద్ ఖాజా అక్రం అలీ, మహమ్మద్ నాయిముద్దీన్, మహమ్మద్ హబీబ్, షేక్ మునీర్, అజీజ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.