ప్రతిపక్షం, వెబ్ డెస్క్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రతిపక్షాలు అబద్ధాల రాజకీయాలను ఆశ్రయిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని మైనారిటీలు భయపడాల్సిన పని లేదని.. ఎందుకంటే ఇది ఏ పౌరుడి హక్కులను వెనక్కి తీసుకోదని ఓ ఇంటర్వ్యూలో ఆయన మరోసారి స్పష్టం చేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లతో సహా ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వాన్ని అందించడమే సీఏఏ లక్ష్యమని చెప్పారు.
ముస్లింలకు భారతదేశంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని హక్కు ఉందని అయితే, ఈ చట్టం మాత్రం ఆయా దేశాల్లో పీడించబడుతున్న మైనారిటీల కోసమని చెప్పారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమైతే ప్రభుత్వం దీనిపై పునరాలోచించవచ్చా..? అనే ప్రశ్నకు సమాధానంగా, సీఏఏని ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని అమిత్ షా చెప్పారు. తాము అధికారంలోకి రాగానే సీఏఏని రద్దు చేస్తామని కాంగ్రెస్ చెబుతున్న దానిపై వ్యాఖ్యానిస్తూ.. ఎలాగూ ఇండియా కూటమి అధికారంలోకి రాదని తెలుసని ఎద్దేవా చేశారు.