హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ఇళ్లు లేని నిరుపేదలకు స్వంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేయబోతున్నది. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 22,500కోట్ల వ్యయంతో 4,50,000 ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి రాముడి సన్నిధిలో పేదల స్వంతింటి కలను నెరవేర్చేందుకు తాను శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్లు పథకం లక్ష్యం అని తెలిపారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లు లెక్క.. అందుకే ఇందిరమ్మ ఇండ్లను ఆడబిడ్డల పేరుతో పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ ఫక్తు పథకాల పేరుతో రాజకీయ వ్యాపారం..
డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని రేవంత్ ధ్వజమెత్తారు. పదేళ్లు చెప్పిన కథనే మళ్లీ మళ్లీ చెప్పి తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేసిండు. అందుకే కేసీఆర్ పాలనను బొందపెట్టి ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ కు ఒక బలమైన బంధం ఉంది.. అందుకే ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ఖమ్మం జిల్లాలో ప్రారంభించాం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం.. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందించేందుకు ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించాం నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా… ఏ ఊరిలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో ఆ ఊర్లోనే మీరు ఓట్లు అడగండి.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతాం పేదలకు ఇండ్లు ఇస్తామన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఇచ్చిందో చెప్పాలి ఢిల్లీలో రైతులను బీజేపీ ప్రభుత్వం బలితీసుకున్నదని ఆరోపించారు. కాంగ్రెస్‌ప్రభుత్వానికి, పార్టీకి ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా రెట్టింపు ఉత్సహంతో పాలన కొనసాగిస్తామని సీఎం తెలిపారు. ఈ సమావేశంలోడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.