CM Chandrababu about Telugu language: జీతం కోసం మాత్రమే ఇంగ్లిష్ నేర్పిస్తామని, జీవితం కోసం తెలుగు భాషను రక్షిస్తామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగు భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. భాష విధ్వంసానికి గురికాకుండా కాపాడుకొని జాతి వైభవాన్ని భావితరాలకు అందించాలన్నారు.
కాగా, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు మునిమనవడు నాగేశ్వరరావు, మునిమనవరాలు కాంతికృష్ణలతో పాటు తెలుగు భాషా ఉన్నతి కోసం కృషి చేసిన పలువురిని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. పోరాటం ద్వారా మాతృభాషను నిలబెట్టిన వ్యక్తి రామ్మూర్తి పంతులు అని సీఎం అన్నారు. తెలుగు భాషకు చరిత్ర ఉందని, దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషగా తెలుగు నాలుగో స్థానంలో ఉందన్నారు.